
ఇళ్లకు డోర్ నంబర్లు వేయిస్తాం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇళ్లకు డోర్ నంబర్లు వేయిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నెలవారీగా పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే మీటింగ్‌లో భాగంగా స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం తప్పనిసరని ఎన్నికల సంఘం సూచించిందని తెలిపారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఓటు హక్కును కోల్పోతారన్నారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు సరిగ్గా ఉన్నదీ, లేనిదీ గుర్తిస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ పార్టీల సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు డీఆర్వో సమాధానం చెప్పారు. చనిపోయిన వారి ఓట్లు తెలపాలని, వారి ఓట్లు తొలగించటానికి ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో డోర్ నంబర్లు లేకపోవడం వలన కొత్తగా ఓట్లు చేర్చుకోవడం కష్టతరమవుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డోర్ నంబర్లు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే డోర్ నంబర్లు వేయించాలని కోరారు. డీఆర్‌ఓ సమాధానమిస్తూ కమిషనర్లకు చెప్పి డోర్ నంబర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఓటుకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు