
వల!
చేపను బట్టి
ఆదివారమొస్తే మాంసప్రియులు
ఏ చేప తినాలో నిర్ణయించుకుని జిహ్వా
చాపల్యాన్ని చల్లార్చుకోవడం సహజం.
ఆ చేపల వెనుక గంగపుత్రుల కష్టం దాగి
ఉంది. ఎగసిపడే అలలకు ఎదురెళ్లి చేపలు పట్టడమంటే మార్కెట్‌లో డబ్చిచ్చి
కొనుగోలు చేసినంత సులువు కాదు.! చేపల రకాన్ని బట్టి వలలు వినియోగించి,
రేయింబవళ్లు శ్రమించి వేట సాగిస్తారు మత్స్యకారులు. సముద్రంలో వాతావరణాన్ని బట్టి ఎటువంటి చేపలు పడతాయో
అంచనా వేసి ఆ వలలే ఉపయోగిస్తారు.
ఈ క్రమంలో మత్స్య సంపద చిక్కక
ఒడ్డుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం వేట విరామ సమయం కావడంతో కొత్తపట్నం తీరంలోని మత్స్యకారులు
16 రకాల వలలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజన్లకు మరమ్మతులు చేయించుకోవడంతోపాటు బోట్లనూ రెడీ చేస్తున్నారు.
కొత్తపట్నం:
విరామం వేటకే కానీ తమకు కాదంటున్నారు మత్స్యకారులు. పూట గడవడానికి కొందరు పనులకు వెళ్తుండగా మరికొందరు వలలు, బోట్లు, ఇంజన్లు సిద్ధం చేసుకునే పనిలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఏడాది పొడవునా వేట సాగించేందుకు వీలుగా అవసరమైన సామగ్రిని జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వేట విరామం తేదీ ప్రకటించగానే బోట్లను ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు.. కొద్ది రోజులకే కొత్త వలలు కొనుగోలు చేశారు. వాటిని క్రమ పద్ధతిలో అల్లుకుంటున్నారు. సముద్రంలో లభించే దాదాపు 52 రకాల చేపలు వేటాడేందుకు మత్స్యకారులు 16 రకాల వలలను వినియోగిస్తారు. వేట విరామం గడువు ముగిసిన తర్వాత సాగర గర్భంలో మత్స్య సంపద విరివిగా లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేటకు వీలుగా అన్ని రకాల వలలను సమకూర్చుకుంటున్నారు. ఒక్కో బోటుకు 16 రకాల వలలు తయారు చేసుకుంటున్నట్లు జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులు చెబుతున్నారు. వంజరం వలలు, చందువా, బంక సీదలు, సీదలు, గుల్ల రొయ్యల వలలు, గేరకాళ్లు, పెద్ద రొయ్యల వలలు, అడస రొయ్యల వల, పూసల వల, జాయింట్ వల.. ఇలా వివిధ రకాల వలలను రూ.లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద కూనాం చేపలను వేటాడేందుకు వినియోగించే రింగు వలలు రకం, పరిమాణాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా, బోటు రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. మూడు ఇంజన్లు వినియోగించే ఈ బోట్లు, రింగు వలలు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో మత్స్యకారులు బృందంగా ఏర్పడి వేట సాగిస్తున్నారు.
వేట విరామ సమయంలో బిజీబిజీగా మత్స్యకారులు
ఒక్కో బోటుకు 16 రకాల వలలు సిద్ధం చేసే పనిలో నిమగ్నం
ఇంజన్లకు మరమ్మతులు, బోట్లకు తుది మెరుగులు
జూన్ 15 నుంచి మొదలుకానున్న బతుకు వేట

వల!