
రైతులకు బాసటగా నిలుద్దాం
● అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: రాష్ట్రంలోని రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల వద్ద చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. మద్దిపాడు మండల కేంద్రం సమీపంలోని ఘడియపూడి కాలనీలో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ రైతులు, మహిళలు మోసానికి గురవుతున్నారని గుర్తు చేశారు. రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు కదలిరావాలన్నారు. యూరియాతో సహా ఇతర ఎరువులు వెంటనే పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు పల్లపాటి అన్వేష్, పైనం శ్రీనివాసరావు, కంకణాల సురేష్, సన్నపురెడ్డి రమణమ్మ, కాకర్లపూడి రజని, మండవ బాలచంద్రమౌళి, మంద ప్రసాద్, రాయపాటి విల్సన్, కావూరి ఏసేబు, డాకా రాజీవ్‌రెడ్డి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.