
స్టాఫ్ నర్సులపై మెడికల్ ఆఫీసర్ల పెత్తనం
ఒంగోలు టౌన్: అర్బన్ వైద్యశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్సులపై మెడికల్ ఆఫీసర్లు పెత్తనం చలాయిస్తున్నారని, వైద్యారోగ్య శాఖ అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్టాఫ్ నర్సులు ఆరోపించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ ఆదివారాలు, పండుగ రోజులు కూడా పనిచేస్తున్నప్పటికీ డే ఆఫ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, కొందరు మెడికల్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని యూనియన్ సభ్యులు, నాయకులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యూపీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, పదవీ విరమణ సౌకర్యాలు కల్పించాలని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా కె.హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ సుధాకర్, కోశాధికారిగా షేక్ ఖాజావలి, అర్గనైజింగ్ సెక్రటరీగా అరుణ కుమారి, వైస్ ప్రెసిడెంట్లుగా జి.శ్రీనివాసరావు, నిర్మలకుమారి, వాసవి, కార్యర్శులుగా సుభాషిణి, జి.రామారావు, కో ట్రెజరర్‌గా ఆంజనేయులును ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.