హిజ్రాలకు శిక్షణ కార్యక్రమాలు
ఒంగోలు వన్‌టౌన్: హిజ్రాలకు పోటీ పరీక్షలు, నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా లు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా సహాయ సంచాలకులు సువార్త శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు సహాయపడతాయన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్/డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని ఆసక్తి గల హిజ్రాలు సంబంధిత కార్యాలయం నుంచి దరఖాస్తులు పొంది పూర్తిచేసి తిరిగి అదే కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 08592–281310 నంబర్‌ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.