
మార్కెట్‌కి అనుగుణంగా బేళ్లు తీసుకురావాలి
● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్
కొండపి: మార్కెట్‌కి అనుగుణంగా పొగాకు బేళ్లు తీసుకురావాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ సూచించారు. శుక్రవారం కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులంతా మార్కెట్‌లోకి అనుగుణంగా పొగాకు బేళ్లను తీసుకురావాలని కోరారు. మండెల్లో మగ్గిన పొగాకును బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలన్నారు. బేళ్లను అమ్మకానికి తీసుకొచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను రైతులకు వివరించారు. రైతులు వేలానికి తీసుకొచ్చిన బేళ్లలో నోబిడ్స్ లేకుండా మంచి సరాసరి ధరతో కొనుగోలు చేసేలా బయ్యర్లతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఇది రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడంలో కీలకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, వేలం నిర్వహణ అధికారి జి.సునీల్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.