
జగనన్న పర్యటనను విజయవంతం చేయండి
దర్శి (కురిచేడు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. దర్శిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని విమర్శించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారన్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతు సోదరులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని బూచేపల్లి కోరారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మద్దతు ధర కల్పించి వారికి భరోసా ఇచ్చారని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులను ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ రత్నరాజు, దర్శి వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్యయాదవ్, రాష్ట్ర మున్సిపాలిటీ వింగ్ కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీ దేవప్రసాద్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా భాస్కర్, వైఎస్సార్ టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా నిలవండి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి