
బాలకృష్ణారెడ్డి పుస్తకాలను ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు
ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈనెల 11, 12 తేదీల్లో నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మాగుంట కార్యాలయ మేనేజర్ భవనం సుబ్బారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 6 గంటలకు స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 9 గంటలకు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బాలినేని నివాసానికి చేరుకుంటారు. 11 గంటలకు స్థానిక తన కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉంటారు.
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిన సాహిత్యం
ఒంగోలు టౌన్: న్యాయమూర్తిగా ఆదర్శనీయమైన జీవితాన్ని గడిపిన బాలకృష్ణారెడ్డి తనదైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ చేసిన రచనలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తిస్తుంటాయని నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డా.నాగభైరవ ఆదినారాయణ అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య కార్యాలయంలో విశ్రాంత న్యాయమూర్తి బాలకృష్ణారెడ్డి రచించిన ‘అక్షర ప్రస్థానం’, ‘నా జీవితమే కవిత్వం’ పుస్తకాలను డా.చుంచు చలమయ్య ఆవిష్కరించారు. నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రంథావిష్కరణలో ఆదినారాయణ ప్రసంగిస్తూ సొంత శైలితో రచనలు చేసిన బాలకృష్ణారెడ్డి తెలుగు సాహిత్యంలో నిలిచిపోయేలా మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు. సమాజాన్ని జీవనదిలా నిత్య చైతన్యం కలిగించే సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సాహితీవేత్తలు శ్రీరామకవచం రామసాగర్, కేఎస్వీ ప్రసాద్, బీనీడి కృష్ణయ్య, కుర్రా ప్రసాద గురవారెడ్డి, జ్వాలా ఉమామహేశ్వర శర్మ, యువీ రత్నం, ఉన్నం జ్యోతివాసు తదితరులు బాలకృష్ణారెడ్డి సాహిత్యాన్ని విశ్లేషించారు. సమావేశంలో బాదరయ్య, కంచర్ల సుబ్బారావు, సంజీవరెడ్డి, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, బెజవాడ రామారావు పాల్గొన్నారు. రచయిత బాలకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.