
జీవం పోసుకున్న గొట్లగట్టులో సాగు చేసిన బొబ్బర్లు
తాళ్లూరులో ప్రవహిస్తున్న దోర్నపు వాగు
ఒంగోలు సెంట్రల్: జిల్లాలో డిసెంబర్ నెలలో కురిసిన మిగులు వర్షంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. తుఫాన్ కారణంగా వర్షం, గాలులతో తూర్పు ప్రకాశం ప్రాంతంలో కొంత నష్టం చేకూరింది. పశ్చిమ ప్రకాశంలో పది శాతం నష్టం కలిగించినా..ఖరీఫ్, రబీలో వేసిన పంటలకు జీవం పోయటంతో పాటు భూగర్భ జలాలు మళ్లీ పుంజుకోవటానికి ఉపయోగపడ్డాయి. జిల్లాలో జూన్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు నమోదు కావాల్సిన వర్షపాతం 27,437.8 మి.మీ కాగా.. 19,483.8 మి.మీ మాత్రమే నమోదైంది. డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 1651 మి.మీలు కాగా ఈనెలలోనే 3879.5 మి.మీగా నమోదైంది. ఈ వర్షానికి ముందు నైరుతి ముఖం చాటేసింది... ఈశాన్యం జాడ లేకుండాపోయింది. జూన్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు ప్రతి నెలా లోటు వర్షపాతమే. కానీ తుఫాన్ కారణంగా లోటు కొంత తీరేలా వర్షం కురిసింది. అవసరమైనప్పుడు ముఖం చాటేసిన వర్షం.. ఒక్కసారిగా తుఫాన్ రూపంలో రావటంతో రైతులు విలవిల్లాడారు. 38 మండలాల్లో కేవలం తాళ్లూరు, ఎన్‌జీపాడు రెండు మండలాల్లో మాత్రమే డిసెంబర్ నాటికి లోటు వర్షపాతం పోయి మిగులు వర్షపాతంగా నమోదయ్యాయి. రబీలో అధికంగా శనగ, పొగాకు సాగవుతాయి. తుఫాన్‌కు ముందు రబీలో శనగ సాధారణ సాగు 1,38,292 ఎకరాలు ఉండగా, కేవలం 24,115 ఎకరాలు మాత్రమే సాగైంది. మినుము 62,887 ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, 29,820 మాత్రమే సాగైంది. అదేవిధంగా పొగాకు 68,587 ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా 36,972 ఎకరాలు సాగైంది. డిసెంబర్‌లో కురిసిన వర్షాలతో ఆయా పంటల సాగుతో పాటు, చిరుధాన్యాలు అధికంగా సాగు చేస్తున్నారు. ఉద్యానవన పంటలు సైతం ఊపిరి పీల్చుకున్నాయి. అదే విధంగా సస్యరక్షణ, పొగాకు రైతులు మొక్కలు దెబ్బతిన్న స్థానంలో మళ్లీ నాటుకుంటూ రైతులు బిజీగా ఉన్నారు. జిల్లాలో 38 మండలాల్లో నమోదైన వర్షపాతం, లోటు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
మిగులు వర్షంతో ఊపందుకున్న వ్యవసాయం జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు రబీ సాగులో నిమగ్నమైన రైతులు