నల్లమలలో షికారు చేద్దాం | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో షికారు చేద్దాం

Oct 1 2023 1:18 AM | Updated on Oct 1 2023 1:18 AM

రోబోటిక్‌ టెక్నాలజీతో సిద్ధమవుతున్న వన్యప్రాణుల మ్యూజియం - Sakshi

రోబోటిక్‌ టెక్నాలజీతో సిద్ధమవుతున్న వన్యప్రాణుల మ్యూజియం

శ్రీశైలం ఘాట్‌ రోడ్లో ఏర్పాటు చేసిన జంగిల్‌ సఫారీ ముఖద్వారం,

మ్యూజియంలో

వన్యప్రాణుల ఆకృతులు

ఒంగోలు డెస్క్‌

నాగార్జున సాగర్‌– శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్‌) 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అభయారణ్యం పరిధిలో 70 బేస్‌ క్యాంపుల్లో 800 మంది కాపలా కాస్తున్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంది. నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి పెరిగేందుకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా పులులకు ఆహారంగా ఉండే జింకలు, దుప్పులు, అడవి పందుల పెరుగుదలకు అనుకూల ఆవాసం కల్పించడంతో పాటు స్వేచ్ఛాయుత వాతావరణంలో అవి సంచరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పులుల కలయికకు అనుకూలమైన వాతావరణం. దీంతో దట్టమైన అభయారణ్యంలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి పర్యాటకులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎకోటూరిజాలు, జంగిల్‌ సఫారీలతో పర్యాటకులు సంచరించకుండా నిషేధం విధించింది. మూడు నెలల విరామం అనంతరం జంగిల్‌ సఫారీ, ఇష్టకామేఽశ్వరిదేవి యాత్రలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అటవీ ఆంక్షలు ముగియడంతో పర్యాటకులు నల్లమల అందాల వీక్షణతో పాటు అటవీ ప్రాంతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం కలిగింది.

జంగిల్‌ సఫారీకి సరికొత్త హంగులు...

శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని తుమ్మలబైలు సమీపంలో ఏర్పాటు చేసిన జంగిల్‌ సఫారీకి సరికొత్త హంగులు దిద్దారు. ఇవి పర్యాటకులకు మరపురాని అనుభూతి కల్పించనున్నాయి. సఫారీలో తొలుత అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీతో రూపొందించిన మ్యూజియం అందర్నీ ఆకట్టుకోనుంది. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్‌గాయ్‌లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులు ఏర్పాటు చేశారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించిన పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్‌ టెక్నాలజీ ద్వారా స్పీకర్‌లో వినేలా తీర్చిదిద్దారు. అలాగే సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, సందర్శకుల కోసం అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగసులు పర్యాటకులకు సౌకర్యాన్ని అందించనున్నాయి. పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు ఆదివారం ప్రారంభించనున్నారు.

నేటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు మనసు దోచనున్న జంగిల్‌ సఫారీ 14 కిలోమీటర్లు అద్భుత ప్రయాణం రోబోటిక్‌ టెక్నాలజీతో ఆకట్టుకోనున్న మ్యూజియం ఇష్టకామేశ్వరి ఆలయంలో దర్శనాలు ప్రారంభం సందర్శకుల విశ్రాంతికి పగోడాలు

జిప్సీలో ప్రయాణం...

గొర్లెస్‌ కాలువ నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం సుమారు రెండు గంటలు సాగనుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్‌, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. నల్లమల టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని శీతోష్ణస్థితి ప్రాంతమైన పులిచెరువు ప్రాంతం వన్యప్రాణులకు మంచి ఆవాసం. సహజ సిద్ధంగా నీటి వనరులతో ఉండే ఈ ప్రాంతంలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు జింకలు, దుప్పులు, నెమళ్లు, కొండ గొర్రెలు, రేచు కుక్కలు, కుందేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు.. ఇలా ఎన్నో వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశం అటవీశాఖ అఽధికారులకు మాత్రమే ఉండేది. టైగర్‌ సఫారీ ఏర్పాటుతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అద్భుత అవకాశం కలిగింది. జంగిల్‌ సఫారీలో ప్రయాణించే ఒక్కో సఫారీ వాహనంలో అటవీశాఖ ఆరుగురు సందర్శకులకు అనుమతిచ్చింది. ఒక్కో జిప్సీకి రూ.2,400 చార్జీ వసూలు చేస్తారు.

ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం1
1/3

ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం

నల్లమలలో సంచరిస్తున్న పెద్దపులి2
2/3

నల్లమలలో సంచరిస్తున్న పెద్దపులి

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement