
కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్న తహశీల్దార్ ఉష
సింగరాయకొండ: స్థానిక గంజి కళ్యాణ మండపంలో ఈనెల 27వ తేదీ బుధవారం మండల స్థాయిలో కలెక్టర్ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్ స్వయంగా పాల్గొంటారని తహశీల్దార్ సీహెచ్ ఉష తెలిపారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్పందన కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో షేక్ జమీఉల్లా మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
27న ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్ సుబ్బారావు, కె.వనజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు చెందిన విద్యార్థులు హాజరుకావొచ్చన్నారు. అండర్–14, అండర్–17 జట్ల ఎంపికకు నిర్వహించే ఈ ప్రక్రియలో అండర్–17 విభాగంలో హాజరుకాదలచిన ఇంటర్ విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, జ్ఞానభూమి చైల్డ్ ఐడీ నంబరు, సంబంధిత ప్రిన్సిపాల్‌ఽ ధ్రువీకరణతో నిర్వాహకులకు సమర్పించి హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్లు కె.మాల్యాద్రి, జంషీర్ అహ్మద్‌లను సంప్రదించాలన్నారు.
రాష్ట్రస్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
చీమకుర్తి: డాడ్జ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చీమకుర్తిలో నిర్వహించిన క్రీడాకారుల ఎంపికలో పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన క్రీడాకారుల్లో 12 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 1, 2 తేదీల్లో బాపట్ల జిల్లా చిలుమూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బారావు తెలిపారు.
26, 27న పాఠశాల సముదాయాల సమావేశాలు
ఒంగోలు: పాఠశాల సముదాయాల సమావేశాలు ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించాలని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వీఎస్ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో హెడ్మాస్టర్లను ఆదేశించారు. 26వ తేదీ ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి 50 శాతం మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు ఈనెల 27న హాజరుకావాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఈనెల 26న తెలుగు, గణితం, బయాలజీ ఉపాధ్యాయులు, 27న ఇంగ్లిషు, హిందీ, సోషల్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరుకావాలన్నారు. 30వ తేదీన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నిర్వహించాలని ఆయా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రాష్ట్ర సమగ్రశిక్ష కార్యాలయం జారీచేసిన అజెండా ప్రకారం నిర్ణీత షెడ్యూలు మేరకు సమావేశాలు నిర్వహించి మినిట్స్ నమోదు చేయాలన్నారు. హాజరైన ఉపాధ్యాయుల వివరాలను మెయిల్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు తప్పనిసరిగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న డాడ్జ్‌బాల్ క్రీడాకారులు