
అటవీశాఖపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్
● కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: పులుల సంఖ్యతోపాటు అడవుల్లో సంచరిస్తున్న ప్రాంతం కూడా పెరుగుతున్నందున ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు పులుల బారిన పడకుండా ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులను రీ లొకేట్ చేయడంలో వారికి అవసరమైన జీవనోపాధి చూపి స్థిర నివాసం కల్పించాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా ప్రాంతంలో అనుసరించిన విధానాలను ఇక్కడ కూడా అమలు చేసేలా పరిశీలన చేయాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిన స్థలాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు లేకుండా చూడాలన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో పట్టాలు మంజూరు చేసినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేసి గిరిజనులకు రెవెన్యూ భూములు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ (ఫారెస్ట్) జీ విఘ్నేష్, మార్కాపురం సబ్‌కలెక్టర్ సేతు మాధవన్, ఏఎస్‌పీ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ శ్రీలత, డీఎఫ్‌ఓ సునీత, డీడీ వై నరసింహులు, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.