ఒంగోలు బసవడే.. అజేయుడు

- - Sakshi

ఒంగోలు గిత్త.. సొగసు, పొగరు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. పర్వత శిఖరాన్ని తలపించే మూపురం, లయబద్ధంగా కదిలే గంగడోలు, కొనలు తేరిన కొస కొమ్ములు, కొండలనైనా ఢీకొట్టే దేహదారుఢ్యం ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం. నడకలో రాజసం, నడతలో ధీరత్వం.. కాలు దువ్వి రంకె వేసిందో రచ్చరచ్చే. పందెం బరిలోకి దిగితే బరువైన బండను సునాయాసంగా ఈడ్చుకెళ్లి గిరిగీతను దాటేయడంలో అజేయుడు.  బండలాగుడు పోటీల్లో యజమాని పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయదు. ఎన్నో అపురూప లక్షణాలు సొంతం చేసుకున్న ఈ వృషభరాజు ముందు ఎలాంటి జాతి ఎద్దులైనా బలాదూర్‌ కావాల్సిందే. సై అంటే సై అంటున్న ఈ బసవరాజుపై ప్రత్యేక కథనం. 

తెలుగు రాష్ట్రమైనా.. తమిళ, కన్నడ రాష్ట్రాలైనా బండలాగుడు పోటీల్లో ఒంగోలు బసవడే.. అజేయుడు. రింగ్‌లోకి దిగితే కింగే. ఒంగోలు గిత్తల పేరెత్తితే.. వారెవ్వా అనాల్సిందే. సంక్రాంతి, పర్వదినాలు, ప్రముఖ ఆలయాల తిరునాళ్ల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో బండలాగుడు పోటీలు జరుగుతుంటాయి. ఎక్కడ బండలాగుడు పోటీలు జరిగినా.. జిల్లాకు చెందిన ఒంగోలు జాతి గిత్తలు బరిలోకి దిగుతాయి. సూపర్‌ యానిమల్‌గా పేరొందిన ఈ గిత్తలను యజమాని విజయగర్వంతో బరిలోకి దించుతారు. అంతే విశ్వాసంతో పందాన్ని గెలుస్తాయి. జిల్లాకు చెందిన రైతులు రెండేళ్లుగా పాల్గొన్న పోటీల్లో మూడింతలు విజేతలుగా నిలిచారంటే వీటి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. వీటినే నమ్ముకున్న రైతులు పసిపిల్లలతో సమానంగా చూసుకుంటారు. ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పందేల్లో పాల్గొనే రైతులకు వచ్చే ఆనందం కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినా కలగదంటారు.

పోటీలు ఇలా..
బండలాగుడు పోటీలు వివిధ కేటగిరీల్లో జరుగుతాయి. పాలపండ్లసైజ్‌, రెండు, నాలుగు, ఆరు పండ్లసైజ్‌ కేటగిరీ, సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు ఉంటారు. ఎక్కువ మంది సీనియర్‌, జూనియర్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి పోషణ ఖర్చు పెరిగిపోవడంతో దూర ప్రాంతాల్లో జరిగే పెద్ద పోటీలకు మాత్రమే వెళ్తుంటారు. ప్రైజ్‌ మనీ ఎక్కువగా ఉంటేనే రైతులకు ఆదాయం ఉంటుంది.విజేతలైన ఎద్దులకు ఎద్దులను బట్టి అమ్మకాల్లో మంచి ధర పలుకుతుంది. జత రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతాయి. నంద్యాల, కడప, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, తెలంగాణలో కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, గద్వాల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ పరిసరాల్లో ఎక్కువగా పోటీలు జరుగుతుంటాయి.

నిరంతరం శిక్షణ: బండలాగుడు పోటీల్లో పాల్గొనే గిత్తలకు నిరంతరం శిక్షణ ఇస్తారు. మూడు రోజులకొకసారి 12 క్వింటాళ్ల బరువు ఉన్న బండతో ప్రాక్టీస్‌ చేయిస్తారు. 200 అడుగుల దూరం 25 నిమిషాల్లో పూర్తి చేసేలా మెళకువలు నేర్పుతారు. ఇలా 25 రౌండ్ల చొప్పున శిక్షణ ఉంటుంది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులను పెట్టుకుంటారు. ఉదాహరణకు ఒక రైతు దగ్గర ఎడ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏడుగురిని పెట్టుకుంటే వారందరికీ నెలకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తారు.

అంతా లక్కే.. 
పది ఎకరాల్లో వ్యవసాయం కోసం ఎడ్లను కొన్నాను. తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న ఎడ్ల పందేల పోటీల్లో పాల్గొన్నా. బహుమతులు గెలవడంతో పోటీలపై మక్కువ పెరిగింది. పదహారేళ్ల నుంచి చిన్నా, పెద్ద పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాను. అప్పట్లోనే రెండు లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాను. తర్వాత ఆరేళ్ల కిందట నాలుగు లక్షలు వెచ్చించి మరో జత ఎడ్లను కొనుగోలు చేశాను. క్రమంగా బండలాగుడు పోటీల్లో పాల్గొంటున్నా. ప్రస్తుతం రూ.8 లక్షలకు ఒక జత, రూ.9 లక్షలకు మరో జతను కొన్నా. గతేడాది 20 పోటీల్లో, ఈ ఏడాది ఇప్పటికే 20 పందేలు గెలుచుకున్నా. 
– లక్కు మునీశ్వరయ్య, జేసీ అగ్రహారం, బేస్తవారిపేట మండలం   

పేరు కోసమే..  
మొదట్లో సరదాగా ఎడ్ల పందేల్లో పాల్గొన్నా. ఎద్దులు గెలవడంతో విజయకిరీటం వచ్చినట్టు అనిపించింది. 32 సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొంటున్నా. మొదట్లో పొట్లపాడు రామయోగి తాత తిరునాళ్లలో పోటీచేశాం. మొదటి బహుమతి 5 తులాల వెండి గంట ఇచ్చారు. నవంబరు నుంచి జూన్‌ నెల వరకు పోటీలు జరుగుతుంటాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే పోటీలకు వెళతాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 18 పోటీల్లో పాల్గొన్నాం. 10 మొదటి బహుమతులు, 8 ద్వితీయ బహుమతులు పొందాం. పోటీలకు వెళ్లటానికి ప్రత్యేకంగా ఒకలారీ కొనుగోలు చేశాను. మా ఎద్దులను మా మామ కాటంపెద్దిరెడ్డి, సోదరుడు పోతిరెడ్డి చంద్రారెడ్డి పర్యవేక్షిస్తుంటారు.  
– పోతిరెడ్డి నాగిరెడ్డి, మాజీ సర్పంచ్, కాటంవారిపల్లె, కురిచేడు మండలం    

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top