అమరావతిలో బాబు లూటీ | YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Looting In Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో బాబు లూటీ

May 22 2026 4:56 AM | Updated on May 22 2026 4:56 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Looting In Amaravati

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అంటూ అవినీతి, దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నారు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు 

రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్యంగా మార్చేశారు 

చదరపు అడుగుకు ఏకంగా రూ.20,427తో శాశ్వత భవనాల నిర్మాణం 

ఇంటీరియర్, ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇది ఎంతవుతుందో! 

పాత కాంట్రాక్టులు రద్దు చేసి.. అధిక ధరలతో తిరిగి వారికే కట్టబెట్టిన ప్రభుత్వం 

స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్‌ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా దోచిపెడుతున్నారు 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో 5 స్టార్‌ వసతులకు చదరపు అడుగు 4,500 మాత్రమే..? సెక్రటేరియట్‌ బిల్డింగ్, హైకోర్టు, అసెంబ్లీకి కలిపి ఏకంగా రూ.14 వేల కోట్లకు పైగా వ్యయం 

బినామీలకు రాజధానిలో రోడ్ల పక్కన.. రైతులకు కుంటల్లో, చెరువుల్లో ప్లాట్లు  

సాక్షి, అమరావతి: అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలన్నీ దొంగ మాటలని తేలిపోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికే అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అమరావతిలో స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ (రక్తపోటు) పెరుగుతోంది’ అంటూ మండిపడ్డారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబు తన స్కాముల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆచరణాత్మకంగా (మోస్ట్‌ ప్రాక్టికల్‌) మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్‌గా పెట్టాలని మావిగన్‌ను ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ‘అమరావతి అయితే సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలి. అదే మావిగన్‌ అయితే మొదటి రోజు నుంచే ఫలితాలు వస్తాయని చెప్పాం. 

మేము ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి.. ప్రజలందరూ ఇదే కరెక్టని, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయడం ధర్మం కాదంటుంటే.. సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో బీపీ పెరిగి నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులతో సహా అబద్ధాలాడుతూ, బూతులు తిట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా చంద్రబాబును మావిగన్‌పై స్పందన కోరండి.. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే.. మీపై బ్లాస్ట్‌ కాకపోతే చూడండి’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, అంచనా వ్యయం పెంపు, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం.. తద్వారా చోటుచేసుకున్న భారీ స్కామ్‌లను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ
‘ప్రజలు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతు వినిపించడానికి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు. ఈ కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. రెండేళ్లుగా బాబు పరిపాలనలో తీరు ఇదే. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుసూ్తనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు వైఎస్సార్‌సీపీ, నాపై (జగన్‌పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్‌ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. పొరపాటున చంద్రబాబు నిద్రలో ఉండగా మావిగన్‌ అంటే చాలు గుండె ఆగిపోవచ్చు. మావిగన్‌ అంటే చాలు బాబుకు అంతగా బీపీ పెరుగుతోంది. 

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అనేది దొంగ మాటే
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా ఉండేలా వ్యవహరిస్తున్నారు. లక్షల ఎకరాల్లో అమరావతి నిర్మాణం పేరిట కేవలం రోడ్లు, డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమ కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలు దొంగ మాటలుగా తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, తెస్తున్న (కమిట్‌) అప్పులు రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే బాబుకు రక్తపోటు (బీపీ) వస్తోంది.

మావిగన్‌ అంటే ఉలికిపాటు.. రక్తపోటు
రాష్ట్రానికి ఆచరణాత్మకంగా (మోస్ట్‌ ప్రాక్టికల్‌), ఏపీ పరిస్థితులను పూర్తిగా మనస్సులో పెట్టుకుని మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్‌గా పెట్టాలని మావిగన్‌ను ప్రతిపాదించాం. మచిలీపట్నం–విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ–గుంటూరు మరో 40 కిలో మీటర్లు హైవే వెంట అద్భుత రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ హయంలో నిర్మాణం తలపెట్టిన పోర్టు శరవేగంగా నడుస్తోంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం కనిపిస్తోంది. 3 రైల్వే స్టేషన్లు, 4 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 35–40 లక్షల జనాభా ఉంది. అదే అమరావతి అయితే.. అంతా సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు.  

ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లు
సెక్రటేరియట్‌ బిల్డింగ్‌లకు మాత్రమే రూ.10,665 కోట్లు అవుతుందా? ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఇవి కాకుండా కొత్త అసెంబ్లీ కోసం 11.21 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో నిర్మాణానికి రూ.1,947 కోట్ల ఖర్చు తేల్చారు. అంటే ఎస్‌ఎఫ్‌టీ రూ.17,356 పడింది. కొత్త హైకోర్టుకు 20.32 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో పాక్షికంగా రూ.1,480 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇది పూర్తయ్యే సరికి ఏ స్థాయికి రేట్లు పెరుగుతాయో తెలీదు. ఇలా 5 సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి.. ఏడు బిల్డింగుల కోసం ఏకంగా రూ.14,092 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. 

కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లా?
అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి పార్లమెంట్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 5న లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ, అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు కిలోమీటరుకు రూ.69 కోట్లు ఖర్చయితే.. చంద్రబాబు అమరావతిలోని సీడ్‌ యాక్సెస్‌ నుంచి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్‌కు కిలోమీటర్‌కు రూ.189 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు.

చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు. 
⇒ ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి.
⇒ ప్రజలంతా మావిగన్‌కు మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు.. తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు
⇒ గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, అదే కాంట్రాక్టర్లకు టైలర్‌ మేడ్‌ రిగ్గింగ్‌ పద్ధతుల్లో తిరిగి టెండర్లు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్‌ తదితర రకరకాల పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. 
⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్‌ సదుపాయాలతో కలిపి ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు.

⇒ అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. 
⇒ రాజధానిలో చంద్రబాబు తన మనుషులు ఏబీఎన్‌ రాధాకృష్ణకు, అశ్వినీదత్‌కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌ వంటి వారితో పాటు తన బినామీలకు రోడ్ల పక్కన విలువైన రిటర్న్‌బుల్‌ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా?        
-వైఎస్‌ జగన్‌  

అమరావతిలో ప్లాట్ల స్కామ్‌
చంద్రబాబు తన మనుషులకు, ఏబీఎన్‌ రాధాకృష్ణకు, అశ్వినీదత్‌కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌ వంటి వారితో పాటు తన బినావీులకు అమరావతిలోని రోడ్ల పక్కన విలువైన రిటర్న్‌బుల్‌ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు దిక్కులేదని రైతులు అంటుంటే.. ఇవి సరిపోవని మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రైతులు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. మేం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ, ఆధారాలతో సహా స్కాములను బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే బిల్డప్‌ ఇచ్చి.. ఒక కథ అల్లుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒక పెద్ద మాఫియా ముఠా. వీళ్లు ఏమనుకుంటే దానిపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దొంగ సాక్ష్యాలతో వీళ్ల అధికారులతోనే కేసులు పెట్టిస్తున్నారు.

ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే
వెలగపూడి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అందుబాటులో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. దీనికి శాశ్వత సెక్రటేరియట్‌ అని కొత్తగా నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు. 2018లో ఇవే ఐదు టవర్ల కోసం 52,20,496 ఎస్‌ఎఫ్‌టీ (చదరపు అడుగు) బిల్డప్‌ ఏరియాతో నిర్మాణాలకు రూ.2,271 కోట్లతో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ లెక్కన ఒక ఎస్‌ఎఫ్‌టీకి సుమారుగా రూ.4,350 అవుతుంది. ఇది 2018 రేట్ల ప్రకారం చాలా ఎక్కువ. కానీ, ఇవే బిల్డింగులకు గతంలో ఇచ్చిన పనుల టెండర్లను రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడా గతంలో ఉన్న కాంట్రాక్టర్లే వచ్చారు. అవే కంపెనీలకు, అవే పనులు దక్కాయి. ఒక టైలర్‌ మేడ్‌ రిగ్గింగ్‌ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది.

⇒ ఐదు బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్‌ కోసమే రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ భవనాల ఆవరణలోనే డ్రెయినేజీ, నీళ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,053 కోట్లు.. లిఫ్టులు, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా బిల్డింగ్‌లకు అదనంగా అద్దాలు వేసేందుకు (గ్లాస్‌ ఫిట్టింగ్‌) రూ.2,540 కోట్లకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. ఒక్కోపనికి ఒక్కో కాంట్రాక్టర్‌ కాదు. అన్నీ వాళ్లకే ఇచ్చారు. 
⇒ ఈ ఐదు బిల్డింగులకు డిజైన్‌ కోసం మరో రూ.401 కోట్లతో కలిపి మొత్తం రూ.10,665 కోట్లు ఖర్చు అవుతుంది. 52,20,496 ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణానికి ఒక ఎస్‌ఎఫ్‌టీకి రూ.20,427 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఫర్నీచర్, ఇంటీరియర్‌ సమకూర్చే సరికి ఎస్‌ఎఫ్‌టీకి రూ.30–40 వేలు అవుతుందేమో. ఇక్కడ భవనాల నిర్మాణానికి ఇసుక ఫ్రీ. పైగా ప్రభుత్వం జీఎస్టీ, ఎంఈఆర్‌ఐటీ, డీఎంఎఫ్, ఎన్‌ఏసీ చార్జీలు రీయింబర్స్‌ చేస్తోంది. వీటి మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతోంది.
⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్‌ సదుపాయాలతో కలిపి ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు. తెలంగాణలో కేసీఆర్‌ 28 ఎకరాల్లో సచివాలయం నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో కట్టారు. అలా చూసినా ఎస్‌ఎఫ్‌టీకి రూ.6 వేలు పడింది. ఇక్కడ ఎస్‌ఎఫ్‌టీ రూ.20,420.. హంగులతో కలిపితే రూ.30–40 వేలు అవుతుందంటే ఎవరికైనా కళ్లు చెదురుతాయి.

అవునయ్యా.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌!
చంద్రబాబు, లోకేశ్‌కు వైఎస్‌ జగన్‌ గట్టి కౌంటర్‌
రాష్ట్రంలో ఓ వైపు పాలన అత్యంత దారుణంగా ఉంటే చంద్రబాబు మరోవైపు తన కొడుకుతో ‘బోత్‌ ఆర్‌ నాట్‌ ది సేమ్‌’ అంటూ బహిరంగ సభల్లో బాలకృష్ణ డైలాగ్‌లు కొట్టిస్తున్నాడు’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వీటికి బదులుగా ఆయన ‘అవునయ్యా.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌’ అంటూ మీడియా సమావేశంలో గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

⇒ ప్రజలకు ద్రోహం చేయడం.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం.. ప్రజలను వాడుకుని వదిలేయడం మీ క్యారెక్టర్‌.. ఆరు నూరైనా ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్‌.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌. 
⇒ పనులు చేసి చూపించడం మా స్టయిల్‌.. పబ్లిసిటీ, క్రెడిట్‌ చోరీ చేయడం మీ స్టయిల్‌.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌. 
⇒ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వీటన్నింటిని నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌..  
⇒ ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా బటన్‌ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర.. రెండేళ్లయ్యేసరికి మేం చేసిన అప్పులకంటే ఎక్కువగా రూ.3.40 లక్షల కోట్ల అప్పులు చేయడం, మా హయాంలో చేసిన పథకాలన్నీ రద్దుచేయడం, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ హామీలు బుట్టదాఖలు చేయడం మీ చరిత్ర.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌.. తెలుసుకో. 

Advertisement
 
Advertisement
Advertisement