
అక్రమ అరెస్టులు, టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్
మా పార్టీని నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం : భూమన
2014–19 మధ్య బాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది.. ఇప్పుడూ కూడా అదే స్థాయిలో జరుగుతోంది : శైలజానాథ్
బాబు పాలనలో లిక్కర్ అమ్మకాలు పెరిగి ఆదాయం తగ్గింది : మార్గాని భరత్
వైఎస్ జగన్‌ను బలహీనపరిచేందుకు లిక్కర్ స్కాం సృష్టించారు : అంబటి
పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు : వరుదు కళ్యాణి
ఆధారాలు లేకపోయినా తప్పుడు సాక్ష్యాలతో కేసులు : గడికోట
బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు : రాచమల్లు
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్‌వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు మరోసారి తెరతీశారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్‌రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..
ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..
లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో
చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి
జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..
విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది.
2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ
అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..
వైఎస్సార్‌సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రి
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
బాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్‌స్టేషన్‌కు, ఎక్సైజ్ స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్‌స్టేషన్‌కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్‌కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.
ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
– మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..
అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో శాంతిలేదు..
రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ