
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సంక్షేమ పథకాల అమలను అమలు చేయమంటే.. సినిమా డేట్స్ మార్చినట్లు మారుస్తున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఒక్కమాట మీద చంద్రబాబు ఏనాడూ నిలపడలేదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ఎవరు నడపబోతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని.. కేవలం మాటలు చెప్పి సీమ ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘సీమ గడ్డకు మీరు చేసిన అన్యాయాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కానీ, హైకోర్టు కానీ ఉండాలి. కానీ ఏదీ చేయకుండా మా ప్రాంత ప్రజలను మోసం చేశారు. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియో ద్వారా పొగిడించుకున్నారు. నిజంగా ఎన్టీఆర్ బతికి ఉంటే మీ గురించి ఏం మాట్లాడే వారో మీకు తెలియదా..?. సీమకు వచ్చిన అనేక ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తరలించారు. మహానాడు సాక్షిగా రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి మీరు చెప్పిన హామీలు మర్చిపోయారా..?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.
‘‘మీరు రాయలసీమ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. హంద్రీనీవాను కూడా సకాలంలో పూర్తి చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం తలపెట్టారు. రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే కనీసం మా హైకోర్టును మాకివ్వాలి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తిరిగి మాకే ఇవ్వాలి. అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ అవసరాలు తీర్చాలి. 50 లక్షల చదరపు అడుగులతో రాజధాని అంటున్నారు. అమరావతి కోసం చేసే అప్పులు అందరూ తీర్చాలా?. మా సంపద తీసుకువచ్చి అమరావతిలో ఖర్చు చేయటం భావ్యమా..?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నలు గుప్పించారు.