
జగన్ బంగారుపాళ్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్‌లా ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించినా.. జనం తండోపతండాలుగా తరలి వచ్చారని, ఇది ప్రభుత్వంపైన జనాలకు ఉన్న ఆగ్రహమేనని భూమన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తిరుపతి, సాక్షి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి.. కార్యకర్తలకు, మామిడి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైనా భూమన మండిపడ్డారు.
‘‘మద్దతు ధర పేరిట మీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ పర్యటన ఖరారు కావడంతో.. కిలో రూ.6 ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. మంత్రిగారూ(అచ్చెన్నను ఉద్దేశించి..) ఒక్కసారి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు దగ్గరికి రండి. యాభై శాతం మామిడి తోటల్లో మామిడి పంట కోయలేదు. లక్ష యాభై వేల టన్నుల మామిడి ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి. లక్ష డెబ్భై వేల టన్నులు తోటల్లో ఉందని స్వయానా ఫుడ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి చెప్పారు. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు.. అది గమనించండి ముందు..
మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ వచ్చారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. చాలామందిని గృహ నిర్బంధం చేశారు. సుమారు 1,600 మంది పోలీసులను మోహరించారు. ఎస్పీ స్థాయి అధికారి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇంకోపక్క.. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని రైతులను అడ్డుకున్నారు. బంగారుపాళ్యంలో ఇవాళ హిట్లర్ పాలన తరహా ఛాయలు కనిపించాయి.
జిల్లా ఎస్పీ అనుమతి మేరకే హెలిప్యాడ్, రూట్ మ్యాప్ ఇచ్చి మీరు అడ్డుకున్నారు. పోలీసు వ్యవస్థను ప్రయోగించినా.. జగన్ కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టి మరీ భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా భయపెట్టిన గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వీళ్లంతా దగా పడ్డ వారే. మా కార్యకర్తలు, మామిడి రైతులను పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. ‘నా కళ్ల ముందే కొడుతున్నారు..’ అని జగన్ కూడా అన్నారు. ఇది చూసి.. స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో వీళ్లంతా ముందుకు కదిలారా? అని నాకనిపించింది. పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నా.. మీ నిర్బంధాలనే కోట గోడల్ని పగలగొట్టి రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తరలి వచ్చారు
జగన్ ఇవాళ రోడ్ షో చేయలేదు. జగన్ వెంట వచ్చింది అభిమాన గణం. ఆ అభిమానంతో బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని కిక్కిరిసి పోయాయి. అంచనాలకు మించి రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ పర్యటనతో దేశంలోనే మా నాయకుడు(వైఎస్ జగన్).. అత్యంత ప్రజాదరణ నాయకుడు అని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం అణచివేత చర్యతో జనాగ్రహం.. జగన్‌కు జనామోదం అని స్పష్టమైంది.
కూటమి ప్రభుత్వ నియంతృత్వ చర్యల్ని ప్రజలు చూస్తున్నారు. మీ రాజకీయ గోతి మీరే త్రవ్వుకుంటున్నారు అనేది గ్రహించక పోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్ళతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. ఇవాళ్టి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసేసింది అని భూమన అన్నారు.