తెలంగాణలో తాలిబన్ల పాలన | YS Sharmila Praja Prasthanam Padayatra Day 8th | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తాలిబన్ల పాలన

Oct 28 2021 1:44 AM | Updated on Oct 28 2021 7:36 AM

YS Sharmila Praja Prasthanam Padayatra Day 8th - Sakshi

పాదయాత్రలో వృద్ధుడిని ఆప్యాయంగా పలకరిస్తున్న వై.ఎస్‌.షర్మిల 

ఇబ్రహీంపట్నం రూరల్‌/కందుకూరు: రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగుతోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపి, సంక్షేమ పాలనను తీసుకొస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం ప్రజాసేవకే అంకితమవుతానని ఆమె తెలిపారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 8వ రోజు బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కొనసాగింది.

ఎల్మినేడు గ్రామంలో అమృతసాగర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో కలసి షర్మిల బతుకమ్మ ఆడారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాటాముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అర్హులకు పింఛన్లు రావడం లేదని, డబుల్‌ బెడ్రూం ఇళ్ల ఊసే లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు.

పంటలు వేసుకునే స్వేచ్ఛను రైతులకు వదిలేయాలని, ఈ విషయంలో అవసరమైతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా ప్రభుత్వం చదువులను అడ్డుకుంటోందని, ముస్లిమ్‌ రిజర్వేషన్లు 12 శాతం పెంచుతామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.  

ప్రజలకోసం వైఎస్‌ఆర్‌లా పనిచేస్తా.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రెండుసార్లు అధికారం ఇచ్చినా ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు. వైఎస్‌ ఎంత అద్భుతంగా పాలన సాగించారో అందరికీ తెలుసని, తానూ ఆయనలా మాట మీద నిలబడి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌టీపీ మాత్రమేనన్నారు. కాగా, మధ్యాహ్నం సమయంలో వైఎస్‌ విజయమ్మ షర్మిలను కలిశారు.

టీవీ యాంకర్‌ శ్యామల షర్మిలతో కలసి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. షర్మిల ఎల్మినేడులో రాత్రి బస చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి వేణుగోపాల్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ముజితాబ్‌ హైమాద్, స్థానిక నాయకులు అమృతసాగర్‌ , కేసరి సాగర్, జంగయ్యగౌడ్, భాస్కర్, రవి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement