
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ఆదివారం ( జులై20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరపున పోరాడే వారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు . వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వపు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్‌ని అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.
I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2025
లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే. చంద్రబాబు తన హయాంలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు తన 2014-19 కాలంలో మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారు. దానికి సంబంధించి ఆధారాలతో సహా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయించేందుకు, ఇప్పటి పాలసీని సమర్ధించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూనే మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం తన గత హయాంలోని అవినీతి పద్ధతులను పునః ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు,పర్మిట్ రూమ్‌లు వెలిశాయి.మా హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేయించాం. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఆ చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
మద్యం మాఫియా రంగంలోకి దిగింది
వైన్ షాపులకు లైసెన్స్ మంజూరు విషయంలో మాఫియాదే పైచేయి అయింది. మా హయాంలో పారదర్శకంగా జరిగిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నారు.చంద్రబాబు మద్యం స్కాంతో సహా అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన మీద ఉన్న కేసుల దర్యాప్తును నిలిపివేశారు. ఆ విషయాల నుండి దృష్టి మళ్ళించడానికి మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.
వైఎస్సార్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు
చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది.అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేసి, జైలుపాలు చేయటానికే సిట్‌ని ఏర్పాటు చేశారు.కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలోనే తేలుతుంది. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు చట్టం ముందు ఇది ఎంతమాత్రం నిలబడదు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు.
ప్రజా గొంతుకగా వైఎస్సార్‌సీపీ
ప్రజల గుండెల్లో వైఎస్సార్‌సీపీ బలంగా పాతుకుపోయింది. ప్రతిపక్షంగా వున్న పార్టీని అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలు నిలబడవు. వైఎస్సార్‌సీపీని అణచివేయాలనుకున్న ప్రతిసారీ మేము ధైర్యంగా నిలబడ్డాం. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకగా నిలబడతాం. ఈ అన్యాయాన్ని ఎదుర్కుంటూ వైఎస్సార్‌సీపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది’ అని స్పష్టం చేశారు.