
యడ్లపాడు: రాష్ట్రంలో బీసీలను మోసం చేసిన వారిని వదిలేసి, సమున్నత స్థానం కల్పిస్తూ.. అన్ని విధాల న్యాయం చేసిన ప్రభుత్వాన్నే ప్రశ్నించడం, విమర్శించడం చంద్రబాబుకు, పచ్చపత్రికలకు అలవాటైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఉన్న పళంగా అందలం ఎక్కించాలనే ఆరాటం పచ్చ మీడియాలో రోజూ కనిపిస్తోందని విమర్శించారు. బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ ఈనాడులో ప్రచురిస్తున్న తప్పుడు కథనాలు జర్నలిజం విలువల్ని దిగజారుస్తున్నాయని చెప్పారు. బీసీలకు అండగా నిలిచిన ప్రభుత్వానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం చూసి ఓర్వలేకే పచ్చపత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
జగనన్న ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌తో పాటు 11 మంది బీసీ మంత్రులు, 10 మంది ఎంపీలు, 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, మెంబర్లు, 44 మంది మున్సిపల్ చైర్మన్లు, ఆరుగురు జడ్పీ చైర్మన్లు, 9 మంది మేయర్లు, 53 మంది ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల్లో ఉండటం చంద్రబాబుకు, పచ్చ మీడియాకు కనిపించదా? అని ప్రశ్నించారు.