3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే.. | TMCs Internal Turmoil Rising Speculation in Bengal Politics | Sakshi
Sakshi News home page

3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే..

May 30 2026 7:41 PM | Updated on May 30 2026 8:02 PM

TMCs Internal Turmoil Rising Speculation in Bengal Politics

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగడాలకు ఇక ముగింపు పడిందని బీజేపీ అంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నుంచి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది తాము బీజేపీలో చేరాలనుకుంటున్నామని నేరుగా చెప్పడం లేదు. వారి తిరుగుబాటు సిద్ధాంతపరమైన మార్పు కంటే, పార్టీలో పెరిగిన అసంతృప్తి, నిరాశ, దూరం పెరగడాన్ని ప్రతిబింబిస్తోంది.

బీజేపీ కూడా వచ్చే మూడు నెలల వరకు ఫిరాయింపుదారులను చేర్చుకునే ఆసక్తి తమకు లేదని బహిరంగంగా ప్రకటించింది. టీఎంసీలోని మంచి, చెడు నేతల మధ్య తేడా స్పష్టంగా తెలిసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పుడు భావిస్తున్నట్లు కాకుండా తమ వద‍్దకు వచ్చిన టీఎంసీ నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. మూడు నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే ఇక పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కనుమరుగు అవుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. వారి ఆరోపణలు దాదాపు ఒకేలా ఉన్నాయి. పార్టీ కార్పొరేట్ శైలిలో నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. నాయకత్వాన్ని చేరుకోవడం కష్టమైందని మరికొందరు చెబుతున్నారు. కీలక సమయాల్లో అభిషేక్ బెనర్జీ రాజకీయంగా అందుబాటులో లేరని కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతమంది సొంత పార్టీ నేతల నుంచి విమర్శలువస్తున్నాయి.

ఓటమిపై మమత సమీక్ష ఏది? 
ఇటువంటి ప్రచారం జరుగుతుండడానికి బలమైన కారణం ఉంది. ఓటమి తర్వాత మమతా బెనర్జీ వాస్తవిక పరిస్థితుల గురించి, పరాజయం వెనుక ఉన్న కారణాల గురించి పునరాలోచన చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు శాశ్వతం కాకపోయినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రతి ప్రధాన రాజకీయ శక్తి తనలోతాను విశ్లేషించుకునే దశలోకి వెళ్తుంది.

చరిత్రలో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలు చూస్తే.. జ్యోతి బసు యుగం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య నాయకత్వానికి సీపీఎం మారిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలో కూడా అంతర్గత చర్చలు జరిగాయి. సీనియర్ కమ్యూనిస్టు నేత అబ్దుల్లా రసూల్ అప్పట్లో నాయకత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు. చివరకు పార్టీ ఆత్మపరిశీలన చేపట్టక తప్పలేదు. సీపీఎం సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి ఆత్మశుద్ధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునే ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కూడా ఇలాంటి ఆత్మపరిశీలన దశను ఎదుర్కొంది.

ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం ఎలాంటి తప్పులను బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా కనిపించడం లేదు. మమతా బెనర్జీ గానీ, అభిషేక్ బెనర్జీ గానీ ఎన్నికల పరాజయానికి వ్యూహాత్మక లేదా సంస్థాగత తప్పిదాలు కారణమయ్యాయని ఒప్పుకోలేదు. దీంతో పార్టీలో మరింత అసంతృప్తి పెరిగి ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఊహాగానాలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement