‘తృణమూల్‌’కే బెంగాల్‌ ఓటు

Times Now C-Voter Survey in Five States Assembly Elections 2021 - Sakshi

తమిళనాడులో డీఎంకే ఘనవిజయం

అస్సాం, కేరళల్లో అధికార పక్షానిదే గెలుపు

తేల్చిన ‘టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌’ సర్వే

న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్‌లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్‌డీఏ, కేరళలో ఎల్‌డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది.

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్‌ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.

స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్‌ఎఫ్‌ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ గౌతమ్‌ ఘోష్‌ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్‌ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్‌ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది.

తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్‌డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్‌ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్‌ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు.

యూపీఏకు 46%, ఎన్‌డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్‌డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్‌కు 46.2% మంది, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు.  

కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్‌డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్‌ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్‌డీఎఫ్‌ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్‌ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్‌డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్‌ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ గెలుస్తుందని టైమ్స్‌ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్‌డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్‌డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top