గొడవ చేయడం.. ఆపై సస్పెండ్‌ అవడం..

Telugu Desam Party MLAs suspended from the Assembly for the day - Sakshi

అసెంబ్లీ కార్యక్రమాలకు టీడీపీ నిత్యం ఆటంకం.. ఆ పార్టీ ప్రధాన అజెండా ఇదే..

స్పీకర్‌ పోడియం ఎక్కి మరీ నినాదాలు 

స్పీకర్‌ ముఖంపైకి కాగితాలు విసురుతూ అరుపులు 

చివరకు సస్పెండ్‌ అయి బయటకు వెళ్లిన వైనం 

శాసనసభ ప్రారంభం నుంచి టీడీపీ సభ్యుల తీరు ఇదే..

సాక్షి, అమరావతి: శాసనసభా కార్యక్రమాలకు ఆటంకం కల్పిస్తూ గొడవ చేయడం.. తద్వారా సస్పెండ్‌ అయి బయటకు వెళ్లిపోవడమే ప్రధాన అజెండాగా టీడీపీ సభ్యులు శనివారం కూడా రచ్చకు దిగారు. పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సహా టీడీపీ సభ్యులందరూ స్పీకర్‌ పోడియంపైకెక్కి పెద్దపెట్టున నినాదాలు చేయడమే కాకుండా పదేపదే కాగితాలు చింపి స్పీకర్‌పై విసరడం ప్రారంభించారు.

స్పీకర్‌కు అడ్డంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన కుర్చీ చుట్టూ మూగి దాదాపు దాడిచేసేలా వ్యవహరించి సభ సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ ఎంతో ఓపిగ్గా వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా పోడియంపైనే నిలబడి నినాదాలు కొనసాగించారు. చివరకు తమను సస్పెండ్‌ చేసిన తరువాత టీడీపీ సభ్యులు శాంతించి బయటకు వెళ్లిపోయారు.  

సభ ప్రారంభం నుంచే.. 
అసెంబ్లీ శనివారం ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ అల్లరి మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రజాసమస్యపై అసెంబ్లీలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశంపై మాత్రమే సభలో  వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టడానికి స్పీకర్‌ తమ్మినేని ఉపక్రమించక ముందునుంచే వారు నినాదాలు మొదలుపెట్టారు.

అచ్చెన్నాయుడు సహా టీడీపీ సభ్యులంతా స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని నినాదాలిచ్చారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కలుగజేసుకుని టీడీపీ సభ్యులకు రోజూ ఇదో అలవాటుగా మారిందని, ఎప్పుడు సస్పెండ్‌ అయి బయటకు వెళ్లిపోదామా.. అని గొడవ సృష్టిస్తున్నారన్నారు. సీఎం పర్యటనపై వాయిదా తీర్మానం ఇవ్వడమన్నది దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. అసలు వారికి వాయిదా తీర్మానం అర్థం తెలుసా.. అని నిలదీశారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నకాలంలో 30 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారని దానిపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు.  సీఎం జగన్‌ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలను పరిష్కరింపచేయడానికి ఢిల్లీ వెళ్లారని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏంచేసేవారో అందరికీ తెలుసునన్నారు. ఆదివారం కూడా అసెంబ్లీ పెడుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా.. మంత్రి బుగ్గన స్పందిస్తూ, ఆదివారం సభ పెట్టాలని ప్రతిపాదించింది అచ్చెన్నాయుడేనని, ఆయన్ని గౌరవిస్తూ సీఎం అందుకు అంగీకరిస్తే దానిపై ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటన్నారు.  

మంత్రి బుగ్గన, దాడిశెట్టి ఆక్షేపణ 
టీడీపీ సభ్యులు స్పీకర్‌ ముఖంపైకి పేపర్లు విసిరేయడం పట్ల మంత్రి బుగ్గన సహా అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ తీరు మారడంలేదని, రోజూ గొడవచేసి బయటకు వెళ్లిపోవడమే వారి అజెండాగా ఉందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. సభను ఆర్డర్‌లో ఉంచడమో, వాయిదా వేయడమో, లేదంటే వారిని సస్పెండ్‌ చేయడమో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు.

ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా   ఉండి కూడా అచ్చెన్నాయుడు పోడియంపైకి ఎక్కడం సిగ్గుచేటని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఎంత చెప్పినా టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్‌ చేసేలా మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు స్పీకర్, సభ ఆమోదంతో టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. అనంతరం బయటకు వెళ్లిపోయారు.

ఐదు ప్రశ్నలు టీడీపీవే.. అయినా.. 
శాసనసభలో శనివారం చేపట్టిన ప్రశ్నోత్తరాలలో మొదటి ప్రశ్న టీడీపీ సభ్యులదే. మాండమస్‌ తుపానులో పంట నష్టపోయిన రైతులకు పరిహారం గురించి ప్రశ్న ఉన్నా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదు. అంతేకాక.. మొత్తం 10 ప్రశ్నల్లో ఐదు టీడీపీ సభ్యులిచ్చిన ప్రశ్నలే. అయినా వాటి పరిష్కారానికి ప్రభు­త్వం ఏమి చెబుతుందో వినకుండా వాయిదా తీర్మా­నం పేరిట నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top