తెలంగాణలో టీడీపీ కనుమరుగు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీ కనుమరుగు

Published Mon, Oct 30 2023 7:46 PM

Tdp Disappear In Telangana State - Sakshi

ఎనభయ్యో దశకలో ఉవ్వెత్తున లేచిన ఒక రాజకీయ కెరటం ఇపుడు విరిగి పడింది. నాలుగ దశాబ్ధాల రాజకీయ జీవితానికి ఇపుడా పార్టీ ఫులుస్టాప్ పెడుతోంది. ఇక, తెలంగాణలో ఆ పార్టీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలో అలా అలా కనుమరుగవుతున్న తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిందే. 1982లో పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల కాలంలోనే అప్పటి దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలకు తెరదించుతూ.. టీడీపీ 203 స్థానాలను గెలుచుకుని 1983లో అధికారాన్ని చేబట్టింది.

పార్టీ అంతర్గత సంక్షోభం తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 1985లో సైతం 202 సీట్లు పొందింది. కానీ, 1989లో వెల్లకిలా పడిన టీడీపీ కేవలం 74 సీట్లతోనే సరిపుచ్చుకుంది. ఆ తర్వాత 1994లో 216 స్థానాలతో ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి అధికారంలోకి వచ్చింది. 1995లో పార్టీ అంతర్గత సంక్షోభం, సొంత మామ ఎన్టీరామారావుకు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న వైనం ఆంధ్రదేశమంతా చూసింది. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో 180 స్థానాలతో అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మొదలైన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సునామిలో కొట్టుకుపోయి 2004 ఎన్నికల్లో కేవలం 47 సీట్లను ముక్కీ మూలిగి తెచ్చుకోగలింది.

2009లో మహా కూటమి అంటూ అన్న పార్టీలు కలిసినా నాటి సీఎం డాక్టర్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా ముందు నిలవలేక 92 సీట్లకు పరిమితం అయ్యింది. ఇక్కడి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ గత చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు బలవంతంగా టీడీపీని ఎన్టీరామారావు నుంచి లాగేసుకున్నాక ఆయన నాయకత్వంలోని టీడీపీ ఎన్నికల చరిత్ర ఏమంత గొప్పగా లేదు. 1999 తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో టీడీపీని చంద్రబాబు గట్టెక్కీయలేక పోయారు.

బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో... తెలంగాణలో పార్టీ మాయం
నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసిపడింది. కాంగ్రెస్ ఇద్దరు సీఎంలు కొణిజేటి రోశయ్య, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిలతో ప్రయోగం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర విభజనకు పచ్చ జెండా ఊపగా.. నాటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతాన్న వల్లించారు. ఈ నక్కజిత్తులను అర్థం చేసుకున్న తెలంగాణ సమాజం, తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన  2014 ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 15 సీట్లు గెలుచుకున్నా.. రాజకీయ పునరేకీకరణ నినాదంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) విసిరిన పాచికతో టీడీపీ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరారు.

టీడీపీ శాసన సభా పక్షాన్ని నాటి టీఆర్ఎస్ శాసన సభాపక్షంలో విలీనం చేశారు. ఈ దెబ్బ ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కనిపించింది. ఆ ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది.  ఇపుడు, వచ్చే నెల (నవంబరు, 2023) 30న జరగనున్న ఎన్నికల్లో అసలు పోటీకే దూరంగా ఉంటూ దుకాణం బంద్ పెట్టింది.

పేరుకే జాతీయ పార్టీ .. తెలంగాణలో చిక్కి శల్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ గా ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది కనుక జాతీయ పార్టీగా నామకరణం చేసి, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీ భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించక పోవడం వల్లే పార్టీ చిక్కిశల్యం అయ్యిందన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుంచే వినిపిస్తోంది.

రాష్ట్రం విడిపోయాక ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైనా.. తెలంగాణ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి, తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో  జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు, బీఆర్ఎస్ కు చెందిన గవర్నర్ నామినేటెడ్, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు రూ.50లక్షలు ఇవ్వజూపిన కేసులో దొరికిపోయిన నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో రాజీచేసుకుని హైదరాబాద్ ను వీడిపోవడం కూడా పార్టీ భవిష్యత్ కు పెద్ద దెబ్బగా చెబుతున్నారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ కనీస ఉనికి కూడా కాపాడుకోలేక పోయింది.

ఈ సారి ఎన్నికలకు దూరం దూరం
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కనీసం 90 స్థానాల్లో పోటీ చేయాలని ఇక్కడి నాయకత్వం భావించింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు కూడా. కానీ, ఏపీ రాష్ట్రంలో అవినీతి కేసులో అరెస్టై , జైల్లో నిందితునిగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు చేతులు ఎత్తేయడంతో ఇక్కడ అక్కడక్కడా నామమాత్రంగానైనా మిగిలి ఉన్న టీడీపీ శ్రేణులను నట్టేట ముంచినట్లు అయ్యిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలోనే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో.. తెలంగాణపై ఏమీ చేయలేమని తేల్చేయడంతో కాసాని ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కునే పనిలో పడ్డారు. అంటే.. 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల సాక్షిగా.. నాలుగు దశబ్ధాల రాజకీయ జీవితం ఉన్న టీడీపీ ఇక చరిత్ర పుటలకే పరిమితం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement