చంద్రబాబు చిత్తూరు టూర్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అడుగడుగునా అసహనం! 

TDP Chandrababu Naidu Chittoor District Tour Failure - Sakshi

పసలేని ప్రసంగాలతో సరి 

అధికార పార్టీపై వ్యక్తిగత దూషణలు 

స్పందించాలని ప్రజలకు వేడుకోలు 

పేలవంగా సాగిన చంద్రబాబు టూర్‌ 

సాక్షి, చిత్తూరు/నగరి/కార్వేటినగరం: వచ్చేది ఆరు నెలలకోసారి.. అది కూడా కార్యకర్తలపై దుమ్మెత్తి పోయడం.. ఓటమికి నైతిక బాధ్యత వహించడం మాని, అంతా మీరే చేశారనే నైరాశ్యం.. అడుగడుగునా అసహనం వ్యక్తం చేస్తున్నా ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతో చంద్రబాబు పర్యటన చప్పగా సాగింది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నగరి, కార్వేటినగరంలో రోడ్డు షోలు నిర్వహించారు. అధికారంలో ఉండగా ఏమీ చేయలేకపోయిన ఆయన, ఇప్పుడు అధికారం కట్టబెడితే ఏదో చేసేస్తానని చెప్పడం హాస్యాస్పదం. బుర్రకథలా చెప్పిందే చెప్పడం ప్రజలకు విసుగుతెప్పించింది. ఇదే సమయంలో ఆయన మాటలు సహించని వరుణుడు కూడా ఇక చాలించు అన్నట్లుగా వర్షం కురవడంతో ప్రజలు కూడా వెనుదిరిగారు. 

పుత్తూరులో కారు అద్దం తీయని బాబు 
చంద్రబాబు తొలుత పుత్తూరులోని బైపాస్‌రోడ్డుకు చేరుకోగా జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో బాబులో అసహనం కనిపించింది. కనీసం కారు అద్దాలు కూడా కిందకు దించకుండానే కాన్వాయ్‌ ముందుకు కదిలింది. దీంతో అక్కడ నిలుచున్న అరకొర అభిమానులు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు. ఇక నగరిలోనూ రోడ్‌షో అంతంత మాత్రంగానే సాగింది. 

చదవండి: (చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి)

మద్యం వద్దనేది పోయి.. 
మద్యం మహమ్మారి గత ప్రభుత్వంలో ఎన్నో కుటుంబాలను నిట్టనిలువునా కూల్చేసింది. అలాంటి మద్యానికి వ్యతిరేకంగా అక్కచెల్లెమ్మలకు అండగా మాట్లాడాల్సిన చంద్రబాబు.. మందుబాబులకు మద్దతుగా ప్రసంగించారు. ‘‘నా తమ్ముళ్ళు పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి ట్యాంకులు ఫుల్‌ చేసుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఇదేం పద్ధతిని అని మహిళలు మనసు నొచ్చుకున్నారు.  

దళితులంటే చిన్నచూపు
కార్వేటినగరం: ‘దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా’ అని గతంలో వ్యంగ్యంగా ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ మాటలనే నిజం చేశారు. పార్టీ కోసం పని చేస్తూ.. ఆయన రాక నేపథ్యంలో ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో మృతి చెందిన దళిత కుటుంబం కనీస పరామర్శకు కూడా నోచుకోకపోవడం దళితుల పట్ల ఆయనకున్న ప్రేమ ఏపాటిదో అర్థమైంది. గోపిశెట్టిపల్లికి చెందిన శంకర్‌ ఎంఎస్సీ చదువుకున్నాడు.

రెండేళ్ల క్రితం వివాహం కాగా.. ప్రస్తుతం భార్య గర్భవతి. చంద్రబాబు నాయుడి రాక నేపథ్యంలో ఫ్లెక్సీలు కట్టేందుకు వెళ్లాడు. విద్యుదాఘాతం చోటు చేసుకుని మృత్యువాత పడ్డాడు. ఇలాంటి సమయంలో ఆ మార్గంలోనే వస్తున్న చంద్రబాబు తమ కుటుంబాన్ని పరామర్శిస్తాడని, ఆదుకునేలా భరోసా కల్పిస్తాడని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే మిగిలింది. తురకమిట్ట క్రాస్‌ వద్ద రాత్రి 9.45 గంటల వరకు వేచి ఉన్నా.. అటుగా వెళ్తున్న చంద్రబాబు కనీసం కారు అద్దాలు కూడా దించకుండా ముందుకు కదిలిన తీరుతో ఇలాంటి నేత కోసమా తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top