ఫైనల్‌ స్టేజ్‌కు ప్రచారం.. కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌!

Special Story On CM KCR And BRS Election Strategy In Telangana - Sakshi

ఇంకా కొద్ది రోజులే మిగిలింది. ఓటరు దేవుళ్ళు నిర్ణయం చెప్పే టైమ్ తరుముకొస్తోంది. అన్ని పార్టీలు ఉరకలు.. పరుగులతో ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణ వినువీధిలో విమానాలు, హెలికాప్టర్ల రొద పెరుగుతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. వ్యూహం మార్చి.. గేర్ మార్చడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? ఇప్పటివరకు సాగిన ప్రచారంపై కేసీఆర్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఇకముందు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది?..

తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అన్ని పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. చావో రేవో అన్నట్లుగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసే అగ్రనేతలు.. రోడ్‌ షోలు.. ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. ఇక అధికార బీఆర్ఎస్ ప్రచారంలో స్పీడ్ పెరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్‌ వ్యూహం మార్చబోతున్నారు. అదేవిధంగా గేర్ మార్చి ప్రచారంలో మరింత స్పీడ్‌గా దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార సభలపై పార్టీ నేతల నుంచి సీఎం కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇప్పటికి దాదాపు 68 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సరిగ్గా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చబోతున్నారు. 

గత వారం రోజుల నుంచి మాటల్లో పదును పెంచిన సీఎం కేసీఆర్ రాజకీయ తూటాలు భారీగా పేల్చుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఇక ప్రచార సరళి, డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌పై కూడా కేసీఆర్ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందిన లబ్దిదారులను ఎంత మందిని కలిశారు? వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటూ అన్ని జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. అందులో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధి దారులు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ గులాబీ బాస్‌కు అందింది. అంతేకాదు యువతలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ ఎన్నికల తేదీ నాటికి వారికి ఏదో ఒక భరోసా కల్పిస్తే పెద్దగా నష్టం ఉండదని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గ ఇంచార్టీలతో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల పని తీరు బాగాలేని అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్ పీకినట్టు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు మారకుంటే విజయం సాధించడం కష్టమేనని వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదని కేసీఆర్ వారికి తెలిపినట్టు సమాచారం. నిన్నటి వరకు జరిగిన సభల తీరు, జనాల నుంచి ఎలాంటి స్పందన ఉందని వార్ రూం బాధ్యుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని, ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని కేసీఆర్ సూచించారు.

ఈనెల 25న హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్‌ నిర్వహించబోతోంది. ఇందుకోసం భారీ జన సమీకరణ చేపట్టాలని సిటీ బహిరంగ సభ తర్వాత ప్రచారం ముగిసే సమయం మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో మరింత వేగంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు కేసీఆర్ సిద్ధం చేశారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిలో ఉన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 25న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా హ్యాట్రిక్ సాధించేందుకు రెండు నుంచి మూడు కొత్త పథకాలు కేసీఆర్ వివరించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలు కూడా అమలు చేసిన ప్రభుత్వం తమది కాబట్టి కచ్చితంగా మరో రెండు మూడు పథకాలు ఈ సభలో ప్రకటిస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని, మళ్లీ అధికారం చేజిక్కించుకోవచ్చనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యాట్రిక్ సాధిస్తామని గులాబీ పార్టీ ధీమాగా ఉంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదని కూడా కేసీఆర్ తన పార్టీ నేతలను, శ్రేణులను హెచ్చరిస్తున్నారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో గేర్‌ మార్చి వ్యూహం మార్చుతున్నారు. ఇక, రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top