లోక్‌సభలో డీలిమిటేషన్‌ మంట | Special Parliament session Live: BJP Amit Shah VS Congress KC Vengugopal | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో డీలిమిటేషన్‌ మంట

Apr 16 2026 11:43 AM | Updated on Apr 16 2026 11:59 AM

Special Parliament session Live: BJP Amit Shah VS Congress KC Vengugopal

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వేడెక్కింది. డీలిమిటేషన్‌, 131 రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌-మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.  

2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్‌ చేశాం. ఆ టైంలోనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?. జనాభా లెక్కలు, మహిళా రిజర్వేషన్‌ బిల్లుల తర్వాతే డీలిమిటేషన్‌ ఉంటుందని అన్నారు. ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్‌ చేయాలని చూస్తోంది.131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. 

దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్‌ అవమానించారు. బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తాం?. బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరం ఏంటి?. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చల సమయంలో అన్నింటకీ సమాధానం చెబుతాం’’ అని బదులిచ్చారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది.  

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. అనంతరం వీటిపై చర్చ సభలో చేపట్టారు. 

ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్‌లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రాజ్యసభలో 18న చర్చ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement