కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. భావోద్వేగం | Siddaramaiah resigns as Karnataka CM address press | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. భావోద్వేగం

May 28 2026 3:17 PM | Updated on May 28 2026 9:20 PM

Siddaramaiah resigns as Karnataka CM address press

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. హైకమాండ్‌ ఆదేశాలను అనుగుణంగా రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య మీడియా సమావేశంలో తన పదవీకాలం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

“నేను గవర్నర్ కార్యాలయానికి నా రాజీనామా సమర్పించాను. గవర్నర్ ఇక్కడ లేరు. ఆయన ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు. అందుకే నా రాజీనామాను ఆయన కార్యాలయానికి సమర్పించాను. పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయాలని చెప్పింది. అందుకే నేను ఈ రోజు నా రాజీనామాను సమర్పించాను. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా ఆమోదిస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. 

మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వడం రాజ్యాంగబద్ధం. నాకు ఇన్నాళ్లు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అధిష్ఠానం నాకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చింది. కానీ, నేను రాజ్యసభ సీటును తీసుకోనని అధిష్ఠానానికి చెప్పాను. ఐదేళ్ల కాలానికి నన్ను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తాను. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జాతీయ రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 

దీంతో రాష్ట్ర అత్యున్నత పదవి విషయంలో పార్టీలో చాలా కాలంగా కొనసాగుతున్న నాయకత్వ పోరు ముగిసింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చారు. 

సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా

గవర్నర్‌ కార్యాలయం ఏమంది? 
మరోవైపు, కర్ణాటక గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ మాట్లాడుతూ.. “సిద్ధరామయ్య ఇచ్చిన రాజీనామాను నేను స్వీకరించాను. అయితే గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన దాన్ని ఆమోదిస్తారు” అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement