అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్‌?

Shilpa Ravi Chandra Reddy Fires On Bhuma Akhila Priya - Sakshi

ఇప్పుడొచ్చి శవ రాజకీయాలు చేస్తారా? 

మీ నాన్న ప్రాణ స్నేహితుడి హత్యకు కుట్ర పన్నింది మీరు కాదా? 

పదవి కోసం తాతనే చంపుతామని బెదిరించలేదా? 

ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్‌ 

సాక్షి, నంద్యాల: అబ్దుల్‌ సలాం కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంటే మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం 11వ తేదీ వచ్చి పరామర్శించారని, ఇన్నాళ్లూ ఆమె ఎక్కడికెళ్లారని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు మొదటి నుంచీ శిల్పా కుటుంబం అండగా ఉంటోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 38 వేల మెజార్టీ వచ్చిందంటే ముస్లిం మైనార్టీలు తనకు అండగా నిలవడం వల్లే సాధ్యమైందన్నారు. అఖిలప్రియ శవ, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సొంత తాత అయిన భూమా నారాయణరెడ్డిని విజయ డెయిరీ చైర్మన్‌ పదవి నుంచి దించడానికి ఇంటికి వెళ్లి  చంపుతామని అఖిలప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి బెదిరించలేదా అని నిలదీశారు. సొంత తాతనే మీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారంటే  ఏం రాజకీయం చేస్తున్నారో అందరికీ అర్థమవుతోందన్నారు. ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని అఖిలప్రియ శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని, తాను మొదటి సారి పోటీ చేసి 35వేల మెజార్టీతో గెలిస్తే ఆమె మాత్రం 38వేల మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేశారు.   (24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు)

‘మీ నాన్న ప్రాణ స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి కుట్ర పన్నారు. నంద్యాలలో మాజీ కౌన్సిలర్‌ జాకీర్‌హుసేన్, మరో 9మందిపై ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి వేధించారు. ముస్లిం సోదరులకు అయ్యలూరు మెట్ట వద్ద మాజీ మంత్రి  పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేయించారు. ఉప  ఎన్నిక సమయంలో బేస్‌మెంట్లు సైతం రాత్రికి రాత్రి తొలగించి ముస్లింలను ఇబ్బంది పెట్టారు. వీటిని ముస్లిం సోదరులు మరచిపోలేద’ని అన్నారు. తమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, మీ ఆస్తులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చిన  పర్సెంటేజీలతో సంపాదించినవి కావా అని ప్రశ్నించారు.  దళితుడైన న్యాయవాది సుబ్బరాయుడును  టీడీపీ నాయకులే హత్య చేశారు కాబట్టి అఖిలప్రియ నోరు మెదపడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హబీబుల్లా, గన్నికరీం, మాజీ కౌన్సిలర్‌ జాకీర్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.    (నిన్ను చంపితేగాని చైర్మన్‌ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top