దూషించిన నోటితోనే పులకింతా? | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

దూషించిన నోటితోనే పులకింతా?

Aug 9 2022 3:26 AM | Updated on Aug 9 2022 10:35 AM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: గతంలో ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ఆయన్ను కలిశాక ఎందుకంతగా పులకరించారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలో అందరినీ కలిసినట్లుగానే ప్రధాని మోదీ చంద్రబాబును కూడా కలిసి ఓ ఐదు నిమిషాలు మాట్లాడారన్నారు. అదే మహద్భాగ్యమని ప్రధాని మోదీని తిట్టిన నోటితోనే ఎల్లో మీడియాలో చంద్రబాబు భారీ ప్రచారం చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు దిగజారుడులో మరో అధ్యాయం మొదలైందనుకోవాలని వ్యాఖ్యానించారు.

సజ్జల సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిశాక ప్రధాని మోదీతో కలసి ముఖ్యమంత్రి జగన్‌ డిన్నర్‌ చేశారు. ఆ టేబుల్‌పై కూర్చునే అవకాశం ముగ్గురు ముఖ్యమంత్రులకే లభించింది. అప్పుడు దాదాపు గంటకు పైగా పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్‌ చర్చించారు. అయితే సీఎం జగన్‌ దీన్ని ఎక్కడా ప్రస్తావించ లేదు, ఆర్భాటంగా ప్రచారం చేసుకోలేదు. చంద్రబాబు విపరీతమైన అభద్రతా భావంతోనే ప్రధాని పలకరింపులంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 

సెల్ఫ్‌ మోటివేషన్‌.. హిప్నాటిజం
2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి వెంటిలేటర్‌ దశకు చేరుకున్న టీడీపీ ఈ మూడేళ్లలో ఏ ఒక్క ఎన్నికలోనూ కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్‌ అమలు చేశారు. చెప్పని హామీలను కూడా అనేకం అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. టీడీపీ నేతలు సెల్ఫ్‌ మోటివేషన్, హిప్నాటిజమ్‌ చేసుకుంటూ నీతి తప్పి, గతి తప్పి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు ఛీత్కరించి మూడేళ్లు అవుతోంది. ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించి చరిత్రహీనుడిగా మారిస్తే ఢిల్లీ వెళ్లి బట్టీ పట్టిన మాటలు చెబుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.

వన్‌ ప్లస్‌ వన్‌ విధానమా?
గతంలో పాలన ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అనే విషయాలతో ప్రజల వద్దకు వెళ్లకుండా చంద్రబాబు ఊతకర్రల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాన్ని నేరుగా ఒప్పుకోకుండా బీజేపీ వారే తన వెంట పడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడే విధంగా తాను, పవన్‌కళ్యాణ్‌ పని చేస్తామని, అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌లో తమకు సహకరించాలని చంద్రబాబు కోరుతున్నట్లు అనిపిస్తోంది. ఇది గత నాలుగైదు నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్రానికి ఏం చేస్తామనేది కాకుండా తెలంగాణలో మద్దతు ఇస్తామని చెప్పడం ఏమిటి? ఇదేమన్నా వన్‌ ప్లస్‌ వన్‌ విధానమా?

సీఎం జగన్‌ది విలువల రాజకీయం
చంద్రబాబు ఏ పనైనా ఓట్లు, స్వార్థ రాజకీయం కోసమే చేస్తారు. సీఎం జగన్‌ది ప్రజా అజెండా. అన్ని వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారు. సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ ప్రజలనే నమ్ముకుని పని చేస్తున్నారు. రేపు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అంతా కట్ట కట్టుకుని వస్తే వారి ఉద్దేశం ఏమిటి? దానివల్ల ఎవరికి ప్రయోజనం? లాంటివన్నీ ప్రజలకు వివరిస్తాం. వారు స్వార్థం కోసం ఎలా జత కడుతున్నారో చెబుతాం. చంద్రబాబు ఏనాడూ ప్రజల మనిషి కాదు. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. ఆయన ఇక ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు. 

మార్ఫింగ్‌ కాకపోతే చర్యలు తప్పవు
ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారానికి సంబంధించి గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. ఆ వీడియో వాస్తవమని తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఆ వీడియో వాస్తవమా? కాదా? అన్నది తేల్చడానికి అరగంట చాలని టీడీపీ నేతలు అంటున్నారు. మరి 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు చంద్రబాబు రేవంత్‌రెడ్డి ద్వారా ఏకంగా రూ.50 లక్షలు ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా మాట్లాడారు. అందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఇక్కడ ఒక ఎంపీకి సంబంధించి మాట్లాడిన వీడియోకాల్‌ వేరే ఫోన్‌లో రికార్డు చేశారు. అందులో ఎవరున్నారో తెలియదు. ఎవరు రికార్డు చేశారో తెలియదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement