
పార్టీలో చేరిన అనంతరం రాహుల్‌గాంధీ, రేవంత్, భట్టితో బడంగ్‌పేట్ మేయర్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పెద్దఎత్తున ఉన్నందునే, ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కిరాయి మనుషులతో టీఆర్‌ఎస్, బీజేపీలు కొద్దిరోజులుగా హడావుడి చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసంలో బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు, బడంగ్‌పేట్ 20వ, 23వ డివిజన్ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాసరెడ్డి సహా పలువురు టీఆర్‌ఎస్ నాయకులకు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ తర్వాత పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పథకం ప్రకారమే ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు నిలదీయలేదని రేవంత్ ప్రశ్నించారు. మహిళలపై దాడులు, హైదరాబాద్ వరదలు, రైతుల కష్టాలపై బీజేపీ నేతలెవరూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించలేదని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే విషయం అర్థమవుతోందని ఆరోపించారు.
ప్రజలు కాంగ్రెస్‌తో కలసి రావాలి: భట్టి
కాంగ్రెస్ భావజాలం, టీఆర్‌ఎస్ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఘర్‌వాపసీ నేతలకు సీఎల్పీ నేత భట్టి సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు కాంగ్రెస్‌తో కలసి రావాలని కోరారు. కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినా తమ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరానని మేయర్ పారిజాతరెడ్డి తెలిపారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాసమస్యలు తీర్చలేక పోతున్నందున మళ్లీ కాంగ్రెస్‌లో చేరామన్నారు.