బీజేపీకి రాజీనామా.. నేడు టీఆర్‌ఎస్‌లోకి

Ravula Sridhar Reddy Resigns TO BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీకి సీనియర్‌ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అలాగే కార్యకర్తలు, అనుచరులతో కలిసి నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసిన శ్రీధర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. బీజేపీ కీలకంగా భావించే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముందు శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా నేతలు భావిస్తున్నారు.

దీనిపై శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..  ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో 11 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. జూబ్లీహిల్స్ నుంచి 2018లో పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేశాను. బీజేపీ అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు పూర్తి అబద్ధాలు చెప్పడం నచ్చడం లేదు. కేసీఆర్ ద్వారా తెలంగాణ సాధ్యమైంది. 6 ఏళ్లుగా పురోగమిస్తుంది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారు. ఈ మధ్య కేంద్ర విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. 

వ్యవసాయ బిల్లు రైతులకు గుదిబండగా మారుతోంది.తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తుంటే.. బీజేపీ కార్పొరేట్ మయం చేస్తోంది. ఆత్మవంచన రాజకీయాలు చేయడం నచ్చడం లేదు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోంది. కేంద్ర నిర్ణయాలు తిరోగమన దిశగా ఉన్నాయి. రైతులకు విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడం సమంజసం కాదు.తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్.. ఆధ్వర్యంలో తెలంగాణ భద్రంగా ఉంది. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించాను.’అని అన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top