వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు పెద్దపీట | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు పెద్దపీట

Published Thu, Apr 27 2023 4:42 AM

R Krishnaiah about bc positions in ysrcp - Sakshi

పాత గుంటూరు/నరసరావుపేట: రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బుధవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. మాటలు చెప్పే నాయకుడిలా కాకుండా ఎన్నికలకు ముందుఅన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయారన్నారు.

రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో మొదటిసారి బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఉనికి కోసమే సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారిని అక్కున చేర్చుకుంటారని, ఆ స్థానం సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాల­ను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తే బీసీల అభివృద్ధి బాగుంటుందని అన్నారు.

ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆ పథకాలను సద్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు నాని అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.వెంగళరావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్, సంఘం జాతీయ కన్వీనర్‌ సి.రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement