Presidential Elections 2022: జార్ఖండ్‌లోనూ మహా సీనే...!

presidential election 2022: Hemant Soren-led JMM likely to support NDA candidate Draupadi Murmu - Sakshi

మహారాష్ట్ర తరహాలో జార్ఖండ్‌లో కూడా ఆపరేషన్‌ కమలానికి రంగం సిద్ధమవుతోందా? జేఎంఎం–కాంగ్రెస్‌–ఆర్జేడీ సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లుతున్నాయా? రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జేఎంఎం అధినేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ జై కొట్టడంతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది...

జార్ఖండ్‌ గవర్నర్‌గా 2015–2021 మధ్య పని చేసిన ద్రౌపది ముర్ముకు అదే రాష్ట్రానికి చెందిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు హేమంత్‌ సోరెన్‌ కూడా నిన్నామొన్నటిదాకా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా వెంటే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 17 విపక్షాల ఉమ్మడి భేటీలో సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది ఆయన తాజాగా ప్లేటు ఫిరాయించారు.

ముగ్గురు జేఎంఎం ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేయాలని ఆదేశించారు. దాంతో జార్ఖండ్‌ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయా అన్న చర్చకు తెర లేచింది. సిన్హా జార్ఖండ్‌కు చెందినవారే అయినా ముర్ము వైపే హేమంత్‌ మొగ్గు చూపడం వెనుక బీజేపీ వ్యూహం దాగుందంటున్నారు. ముర్ము సంథాల్‌ తెగకు చెందిన గిరిజన మహిళ. హేమంత్‌ కూడా అదే తెగకు చెందినవారు. తాను జార్ఖండ్‌ మట్టి బిడ్డనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే జేఎంఎం ముర్ముకు ఓటేయనుందని పార్టీలో ఓ వర్గం చెబుతున్నా, హేమంత్‌ నిర్ణయంతో రాష్ట్రంలో పాలక సంకీర్ణం బీటలు వారుతుందనే చర్చ ఊపందుకుంది.

వెంటాడుతున్న మైనింగ్‌ కేసు
హేమంత్‌ను మైనింగ్‌ లీజ్‌ కుంభకోణం కేసు వెంటాడుతోంది. ఒక గనిని తనకు తానే కేటాయించుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల ఢిల్లీలో ఈసీ విచారణకు హాజరైన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను హేమంత్‌ కలుసుకున్నారు. కేసు నుంచి బయట పడటానికే షాతో భేటీ అయ్యారని ప్రచారమూ జరిగింది. మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో హేమంత్‌ సహాయకులపై ఈడీ దాడులు, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన ఐఏఎస్‌ పూజా సింఘాల్‌ అరెస్ట్‌ వంటివి కూడా సీఎం ఇబ్బందుల్లోకి నెట్టాయి.

జేఎంఎంకు దూరంగా కాంగ్రెస్‌
తాజా పరిణామాల్లో మరో రాష్ట్రం తమ చేజారుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్‌లో నెలకొంది. నిజానికి జేఎంఎం బీజేపీతో చేతులు కలుపుతుందనే సందేహాలు ఆ పార్టీని కొద్ది రోజులుగా వేధిస్తున్నాయి. మేలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌ ఒక సీటు డిమాండ్‌ చేయగా హేమంత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హేమంత్‌ సంకీర్ణ ధర్మం పాటించడం లేదంటూ అప్పటికే అసంతృప్తిగా ఉన్న  కాంగ్రెస్, తమ నాయకులందరినీ సీఎంకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్టు స్థానిక మీడియా కథనాలు రాసింది.
             
బీజేపీకి ఒరిగేదేమిటి?
2019లో జరిగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులెవరూ బీజేపీకి మద్దతివ్వలేదు. గిరిజన ప్రాబల్యమున్న 28 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం–కాంగ్రెస్‌ కూటమి ఏకంగా 25 నెగ్గింది. బీజేపీ రెండింటికే పరిమితమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎంకు 30, కాంగ్రెస్‌కు 16, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎంను చేరదీసి ప్రభుత్వానికి మద్దతిస్తే ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు 2024 ఎన్నికల్లో జేఎంఎంతో కలిసి రాష్ట్రంలో గిరిజన ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాథుల వ్యూహమంటున్నారు.

మోదీపై ప్రశంసలు
బీజేపీకి దగ్గరవాలని ప్రయత్నిస్తున్న హేమంత్‌ ఇటీవల ప్రధాని మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జార్ఖండ్‌లో దేవగఢ్‌ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి మోదీ జరిపిన రాష్ట్ర పర్యటనకు హేమంత్‌ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూశారు. పైగా ఆ కార్యక్రమంలో మోదీ సమర్థతను బహిరంగంగానే ప్రశంసించారు. ‘‘కేంద్రం నుంచి మాకు సహకారముంటే వచ్చే ఐదేళ్లలో జార్ఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెడతాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారముంటేనే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది’’ అన్నారు. ఆయన కూటమి మార్చేస్తారన్న ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చింది.
 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top