సాక్షి,జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, అవమానాలు భరించలేక మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రంగంలోకి దిగింది.
మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఆయనను కాంగ్రెస్‌లో కొనసాగాలని కోరనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.
జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా, రాజీనామా ప్రకటించే కొన్ని గంటల ముందు పీసీసీ చీఫ్ రాకతో జీవన్ రెడ్డి నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు..గత ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవమానం భరించలేక కాంగ్రెస్‌ను వీడనున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జీవన్‌రెడ్డి ప్రకటన అనంతరం, ఆయన ఇంటి వద్ద ఓ పోస్టర్ వెలసింది. అందులో ఒకవైపు జీవన్‌రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్‌స్టార్ జీవన్‌రెడ్డి’ అని ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. జీవన్‌రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? విఫలమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది.


