కరోనా దెబ్బకు మారిన రాజకీయ ముఖచిత్రం | Political Parties Using Digital Politics Due To Coronavirus | Sakshi
Sakshi News home page

జూమ్‌జామ్‌గా రాజకీయం!

Aug 2 2020 5:37 AM | Updated on Aug 2 2020 8:14 AM

Political Parties Using Digital Politics Due To Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బకు రాజకీయాల ముఖచిత్రం మారిపోయింది. రాజకీయపార్టీల సభలు, సమావేశాల తీరుతెన్నుల్లో మార్పు చోటుచేసుకుంది. ఇక ‘డిజిటల్‌ పాలిటిక్స్‌’తెరపైకి వచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలు, విభాగాల్లో కీలక మార్పులకు కారణమవుతున్న కోవిడ్‌ రాజకీయరంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో, ఇప్పుటికే మారిన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు, నేతలు తమ ప్రచార పద్ధతులు, కార్యక్రమాల స్వరూపాలను మార్చుకోక తప్పనిస్థితి ఏర్పడింది. పార్టీలకు ఇక డిజిటల్‌ క్యాం‘పెయిన్‌’తప్పదు!

మొదలైన డిజిటల్‌ కార్యక్రమాలు
రాష్ట్రంలో ఇప్పటికే ప్రధానపార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఉభయ కమ్యూనిస్టుపార్టీలు, టీజేఎస్, ఇతర రాజకీయపక్షాలు డిజిటల్‌ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. జూమ్‌ యాప్, ఇతర సాంకేతికతల ద్వారా ఆన్‌లైన్‌ మీడియా కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం టీజేఎస్, టీటీడీపీ, ఇతర వామపక్షపార్టీలు కలిసి ఆన్‌లైన్‌లో సంయుక్తంగా అఖిలపక్ష సమావేశాలు, రౌండ్‌టేబుల్‌ భేటీలు నిర్వహిస్తున్నాయి. కమ్యూనిస్టుపార్టీలు ఆన్‌లైన్‌ రచ్చబండ చేపట్టాయి. వివిధ ప్రజా సమస్యలు, ప్రాధాన్యతాంశాలపై బహిరంçగసభలను కూడా డిజిటల్‌ తెరపై నిర్వహించాయి. 

బహిరంగసభలు, ర్యాలీలు లేకుండానే..
రాజకీయాలంటేనే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండడం, ఎన్నికలప్పుడైతే ఇంటింటి క్యాంపెయిన్, వీధి చివరి మీటింగ్‌లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగసభలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఉండేది. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మున్ముందు ఎన్నికలప్పుడు, ఇతర సమయాల్లో డిజిటల్‌ క్యాంపెయినే మాధ్యమంగా ఉపయోగపడనుంది. ఇప్పుడిప్పుడే మహమ్మారి తగ్గుముఖం పట్టే అవకాశాల్లేకపోవడంతో కనీసం ఏడాది దాకా భౌతికదూరం పాటించడం తప్పనిసరి. దీంతో ప్రజలు, కార్యకర్తలను రాజకీయపార్టీల నేతలు ముఖాముఖి కలుసుకోవడం దాదాపు అసాధ్యమే.

ఆ 3 రాష్ట్రాల్లో ..
సమీప భవిష్యత్‌లోనే జరగనున్న బిహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయపార్టీల ‘డిజిటల్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌’తొలి పరీక్షను ఎదుర్కోనుంది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు భిన్నంగా ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉంటూ బిహార్‌ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆ రాష్ట్రంలో డిజిటల్‌ ప్రచారాన్ని, ఆన్‌లైన్‌ బహిరంగసభల నిర్వహణను మొదలుపెట్టింది. ఇతరపార్టీలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఓటర్లను పార్టీలు ఎలా ఆకర్షిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

2009 ఎన్నికల్లోనే అంకురార్పణ..
సంప్రదాయ పద్ధతులు, విధానాలకు భిన్నంగా ఎన్నికల సందర్భంగా డిజిటల్‌ మాధ్యమాల ప్రచారం 2009 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైందని చెప్పొచ్చు. ఓటర్ల మొబైళ్లకు ఎస్సెమ్మెస్‌లు, రికార్డెడ్‌ వాయిస్‌ కాల్స్, ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు వాయిస్‌ మెసేజ్‌లు, ఐవీఆర్‌ఎస్‌ వాయిస్‌కాల్స్‌ వంటివి రాజకీయపక్షాలు విరివిగా ఉపయోగించాయి. 2014 ఎన్నికలు వచ్చేప్పటికీ దేశంలో సోషల్‌ మీడియా విస్తరణ మొదలైంది. ఫేస్‌బుక్‌ ఒక ముఖ్యమైన సామాజిక మాధ్యమంగా రాజకీయపార్టీలు, నేతలకు ఉపయోగపడింది.

ఇక 2019 లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించడంతో భారత్‌లో తొలి ‘సోషల్‌ మీడియా ఎలక్షన్‌’కు తెరలేచింది. ఇక భవిష్యత్‌లో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల కల్లా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement