కుటుంబ పాలనకు విముక్తి | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలనకు విముక్తి

Published Sun, Apr 9 2023 1:23 AM

PM Narendra Modi Speech In Hyderabad Public Meeting - Sakshi

..వణికిపోతున్నారు! 
బంధుప్రీతిని, అవినీతిని పెంచి పోషిస్తున్న వారికి దేశ ప్రయోజనాలు, సమాజ శ్రేయస్సుతో సంబంధం లేదు. పైగా నిజాయతీగా పనిచేసే వారికి సమస్యలు సృష్టిస్తున్నారు. కుటుంబ పాలకులకు మూడు అంశాలు ముఖ్యం. మొదటిది వారి కుటుంబాన్ని ప్రశంసిస్తూనే ఉండాలి, రెండోది అవినీతి సొమ్ము ఆ కుటుంబానికి వస్తూనే ఉండాలి, మూడోది పేదలకు పంపే డబ్బు అవినీతిపరుల చేతికి అందుతూనే ఉండాలి. ఇలా అవినీతికి అసలు మూలమైన కుటుంబ పాలనపై నేడు మోదీ దాడి మొదలుపెట్టాడు. అందుకే వాళ్లు వణికిపోతున్నారు, ఏ పని చేసినా కోపంతోనే చేస్తున్నారు.     – ప్రధాని మోదీ  

సాక్షి, హైదరాబాద్‌:  అవినీతి, కుటుంబ పాలన రెండూ వేర్వేరు కాదని, బంధుప్రీతి ఉన్నప్పుడు అవినీతి వృద్ధి చెందడం మొదలవుతుందని.. దీని నుంచి విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కుటుంబ, వంశవాద పార్టీలు అన్నింటినీ తమ నియంత్రణలోనే ఉంచుకుని, నడిపించాలని అనుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేక కేంద్ర ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోందని.. దీనితో తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించారు.

ఎక్కడా నేరుగా బీఆర్‌ఎస్‌ సర్కార్, సీఎం కేసీఆర్‌ పేర్లను ప్రస్తావించకుండా.. పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ‘భారత్‌మాతాకీ జై’అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ‘ప్రియమైన సోదర, సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’అని తెలుగులో మొదటి మాటలు చెప్పారు. తర్వాత హిందీలో కొనసాగించారు. ప్రధాని మోదీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. 
శనివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభా వేదిక నుంచి వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి. 

‘‘దేశం కొందరి తృప్తి (తుష్టికరణ్‌) నుంచి అందరి సంతృప్తి (సంతుష్టికరణ్‌) వైపు మళ్లినప్పుడే నిజమైన సామాజిక న్యాయం పుడుతుంది. తెలంగాణ సహా యావత్‌ దేశం అందరి అభివృద్ధి బాటలో నడవాలి. ఆజాదీకా అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం.  

అవినీతిపై పోరాటానికి సహకరించండి 
కుటుంబ పాలన, బంధుప్రీతి ఉన్నప్పుడు అవినీతి వృద్ధి చెందడం మొదలవుతుంది. తండ్రి, కొడుకు, కూతురు అధికారంలో ఉంటారు. ప్రతి ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిలో వారికి కుటుంబ స్వార్థమే ధ్యేయం. అన్నీ తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని భావిస్తుంటారు.

ఎవరైనా వారి నియంత్రణను సవాలు చేసినప్పుడు తీవ్రంగా ద్వేషిస్తారు. ఇలాంటి అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలా వద్దా? మేం చేస్తున్న అవినీతి వ్యతిరేక పోరాటానికి తెలంగాణ ప్రజలు సహకరించాలి. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో వచ్చే 25 ఏళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడిగా తెలంగాణ వికాసాన్ని పరిపూర్ణం చేద్దాం. 

మా అభివృద్ధిని చూసి ఆందోళన 
2014లో కేంద్ర ప్రభుత్వం వారసత్వ రాజకీయ సంకెళ్ల నుంచి విముక్తి పొందిన ఫలితాన్ని దేశం కళ్లెదుట కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పురోగతిని చూసి కొంత మంది చాలా ఆందోళన చెందుతున్నారు. బంధుప్రీతి, అవినీతిని పెంచిపోషిస్తున్న వారికి ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాలే ప్రధానమన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. 

భాగ్యలక్ష్మి ఆలయ నగరం నుంచి తిరుపతి వెంకన్నకు.. 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం నాకు వచ్చినందుకు ప్రజలకు కతజ్ఞతలు చెప్తున్నాను. రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి రూ.11,300 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను చేపట్టాం. భక్తి, విశ్వాసం, ఆధునికత, టెక్నాలజీ, పర్యాటకాన్ని అనుసంధానిస్తూ భాగ్యలక్ష్మి దేవాలయ నగరం (హైదరాబాద్‌)ను వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతితో కలిపే వందేభారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించాం. 

వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. 
2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతోపాటే తెలంగాణ రాష్ట్రం ఉనికి మొదలైంది. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్రంలోని ప్రభుత్వానిదే. తొమ్మిదేళ్లుగా కేంద్రం రూపొందించిన అభివృద్ధి నమూనాను తెలంగాణ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాం.

గత తొమ్మిదేళ్లలో 70 కిలోమీటర్ల మేర మెట్రోరైలు నిర్మించుకున్నాం., ఎంఎంటీఎస్‌ విస్తరణతో అభివృద్ధి వైపు అడుగులు వేశాం. కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసులతో హైదరాబాద్, సికింద్రాబాద్, సమీప జిల్లాల్లోని లక్షలమంది పౌరులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు కొత్త వ్యాపార కేంద్రాలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా తెలంగాణకు రూ.600 కోట్లు కేటాయించాం. 

కోవిడ్, యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు క్షీణించినా.. 
కరోనా మహమ్మారి, రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా క్షీణించాయి. అయినా ఆధునిక మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కొన్నిదేశాల్లో భారతదేశం ఒకటి. ఈసారి బడ్జెట్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. 
 
రాష్ట్రంలో ఈ మూడింటికీ తోడ్పాటు 
తెలంగాణలో పరిశ్రమలు, వ్యవసాయం రెండింటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నేడు శంకుస్థాపన చేసిన/ప్రారంభించిన ప్రాజెక్టులు సులభ ప్రయాణం (ఈజ్‌ ఆఫ్‌ ట్రావెల్‌), సులభ జీవనం (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌), సులభ వ్యాపారం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)ను పెంచుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం.

11 లక్షలకుపైగా పేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నాం. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. తెలంగాణలో తొలిసారి కోటి కుటుంబాలకు జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు తెరిచాం. రెండున్నర లక్షల మంది చిరు వ్యాపారులకు గ్యారెంటీ లేకుండా ముద్ర రుణాలు అందాయి. 40 లక్షల మందికిపైగా చిన్న రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద సుమారు రూ.9 వేల కోట్లు అందాయి..’’అని మోదీ పేర్కొన్నారు. 
 
తెలంగాణకు రైల్వేబడ్జెట్‌ 17 రెట్లు పెంపు 
గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ పదిహేడు రెట్లు పెరిగింది. కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనులు రికార్డు సమయంలో జరిగాయి. సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ లైన్‌ విద్యుదీకరణ ఇందుకు ప్రధాన ఉదాహరణ. దీనితో హైదరాబాద్‌– బెంగళూరు మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నాం. రాష్ట్రంలో హైవే నెట్‌వర్క్‌ను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం.

రూ.2,300 కోట్లతో నిర్మిస్తున్న అక్కల్‌కోట్‌–కర్నూల్‌ సెక్షన్‌.. రూ.1,300 కోట్లతో మహబూబ్‌నగర్‌–చించోలి సెక్షన్, రూ.900 కోట్లతో కల్వకుర్తి–కొల్లాపూర్‌ సెక్షన్, రూ.2,700 కోట్లతో ఖమ్మం–దేవరపల్లి సెక్షన్‌ చేపడుతున్నాం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లలోపే ఉంటే.. ఇప్పుడు 5వేల కిలోమీటర్లకు పెరిగింది. ఇందుకోసం కేంద్రం రూ.35వేల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు సహా రూ.60 వేల కోట్ల విలువైన హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. 
 
ప్రాజెక్టులు, పనులివీ.. 
► తిరుపతి– సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలుకు పచ్చజెండా.. 
► సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధికి శంకుస్థాపన 
► 13 కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసుల ప్రారంభోత్సవం 
► సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌ డబ్లింగ్, విద్యుదీకరణ జాతికి అంకితం 
► బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవనానికి శంకుస్థాపన 
► తెలంగాణ, ఏపీల పరిధిలో జాతీయ రహదారులు, అనుసంధాన రోడ్లకు శంకుస్థాపన 

 
Advertisement
 
Advertisement