‘ఎల్జేపీ’లో తిరుగుబాటు

Pashupati Paras replaces Chirag Paswan as leader of LJP Parliamentary party in Lok Sabha - Sakshi

చిరాగ్‌ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన పార్టీ ఎంపీలు

లోక్‌సభలో పార్టీ నేతగా చిరాగ్‌ చిన్నాన్న పశుపతి కుమార్‌ ఎన్నిక

న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్థాపించిన ‘లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’లో తిరుగుబాటు తలెత్తింది. పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పార్టీ నేత, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. చిరాగ్‌ పాశ్వాన్‌ స్థానంలో ఆయన బాబాయి, హజీపూర్‌ ఎంపీ పశుపతి కుమార్‌ పరాస్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఉపనేతగా మరో ఎంపీ మెహబూబ్‌ అలీ కైజర్‌ను ఎన్నుకున్నారు. లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి వారు స్పీకర్‌ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. 

పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. పార్టీని తాను విచ్ఛిన్నం చేయలేదని, నిజానికి పార్టీని కాపాడానని పార్టీలో తిరుగుబాటు అనంతరం సోమవారం పశుపతి çపరాస్‌  వ్యాఖ్యానించారు. చిరాగ్‌ పాశ్వాన్‌కు, ఎల్జేపీకి ప్రత్యర్థి అయిన జేడీయూ నేత, సీఎం నితీశ్‌ కుమార్‌ను గొప్ప నాయకుడు, ప్రగతిశీల ముఖ్యమంత్రి అని పరాస్‌ ప్రశంసించారు. ఈ తిరుగుబాటు వెనుక ఆయన లేరన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలో ఎల్జేపీ పోరాడిన తీరుపై 99% కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. పార్టీలోని సంఘ వ్యతిరేక శక్తుల కారణంగా పార్టీ నాశనమయ్యే స్థితికి చేరుకుందన్నారు. ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందన్నారు. ఈ తిరుగుబాటుపై చిరాగ్‌ పాశ్వాన్‌ స్పందించలేదు.  

బాబాయి నివాసం వద్ద గంటన్నర నిరీక్షణ!
తన బాబాయిని కలుసుకునేందుకు చిరాగ్‌ సోమవారం స్వయంగా ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు. చిరాగ్‌ సోదరుడు (కజిన్‌), మరో ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌ కూడా అదే నివాసంలో ఉంటున్నారు. అక్కడ గంటన్నర పాటు వేచిచూసిన తరువాత చిరాగ్‌ పాశ్వాన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ చిరాగ్‌తో ఆయన బాబాయి పరాస్‌ కానీ, సోదరుడు ప్రిన్స్‌ రాజ్‌ కానీ కలవలేదని సమాచారం. ఆ సమయంలో పరాస్, ప్రిన్స్‌రాజ్‌ అక్కడ లేరని ఆ తరువాత అక్కడి సిబ్బంది తెలిపారు. చిరాగ్‌ పాశ్వాన్‌ నాయకత్వంపై చాన్నాళ్లుగా ఎంపీలు పరస్, ప్రిన్స్‌ రాజ్, చందన్‌ సింగ్, వీణాదేవి, మెహబూబ్‌ అలీ కైజర్‌లు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా నిలవడం రాష్ట్రంలో ఎల్జేపీని బాగా దెబ్బతీసిందని వారు విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. 2020లో తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ హఠాన్మరణం అనంతరం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చిరాగ్‌ పాశ్వాన్‌కు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. పరాస్‌ వర్గం పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా పాశ్వాన్‌ను తొలగించనున్నారని, ఆ తరువాత ఎన్నికల సంఘాన్ని కలిసి నిజమైన ఎల్జేపీ తమదేనని గుర్తించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి చిరాగ్‌ పాశ్వాన్‌ను తీసుకోనున్నారనే వార్తల నేపథ్యంలోనే, జేడీయూ సూచనల మేరకే ఈ తిరుగుబాటు జరిగిందని చిరాగ్‌ సన్నిహితులు  ఆరోపించారు. కాగా, ఇది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఎన్డీయే నుంచి విడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్నడూ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించలేదు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top