
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు కొందరు పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, తాండారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈ వార్తలపై స్పందించారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ..‘పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. గువ్వల బాలరాజును నేనే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంకా కొంత మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దు. వేల కోట్ల కాంట్రాక్ట్‌లు ఇస్తామని, ఉన్నత పదవులు ఆశచూపింది బీజేపీ. తెలంగాణకు అన్యాయం చేయవద్దని బీఆర్ఎస్ కంకణబద్దుడిగా, కేసీఆర్ మాసనపుత్రుడిగా నేను సాహసం చేశాను.
సొంతలాభం ముఖ్యం కాదని, తాండూరు అభివృద్ధి ముఖ్యమని భావించాను. కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్లను బహిరంగంగా ఆ రోజు ప్రపంచానికి పట్టించాను. ధైర్యసాహసాలు చేసిన తాండూరు బిడ్డ.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. తెలంగాణను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్‌తోనే వెళ్తాను. ఇతర పార్టీలతో తొత్తులుగా మారిన మీడియాను హెచ్చరిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా.
బీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించుకున్నాం. సొంత పనుల మీద అమెరికా వచ్చాను...త్వరలోనే తిరిగి వస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటాను. పార్టీ మార్పుపై ఎటువంటి ఆలోచన లేదు. త్వరలోనే తాండూరుకు వస్తాను’ అని క్లారిటీ ఇచ్చారు.