నితీశ్‌ నేతృత్వంలో చివరి క్యాబినెట్‌ సమావేశం! | Nitish Kumar calls Cabinet meet on April 14; resignation likely | Sakshi
Sakshi News home page

నితీశ్‌ నేతృత్వంలో చివరి క్యాబినెట్‌ సమావేశం!

Apr 12 2026 6:27 PM | Updated on Apr 12 2026 6:42 PM

 Nitish Kumar calls Cabinet meet on April 14; resignation likely

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14న) క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో అనేక ముఖ్య అజెండా అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది. 

ఈ సమావేశం అనంతరం నితీశ్‌ కుమార్ సీఎం పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15న బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉంది. ఇటీవలే నితీశ్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జేడీయూ వర్కింగ్ ప‍్రెసిడెంట్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్‌ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు.  

కాగా, నితీశ్‌ కుమార్‌ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. సీఎం పదవి నుంచి ఏప్రిల్‌ 14వ తేదీన వైదొలగనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. బీజేపీ నేత బిహార్‌ సీఎం అవుతుండడం ఇదే తొలిసారి. 
 
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.

జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement