ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్‌మీట్‌ అవసరమా? | MLC Kodandaram Slams Pawan Kalyan Over Hyderabad Press Meet, Says Unnecessary Controversies Are Being Created | Sakshi
Sakshi News home page

ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్‌మీట్‌ అవసరమా?

Jun 2 2026 12:12 PM | Updated on Jun 2 2026 12:42 PM

MLC Kodandaram Slams Pawan Kalyan Over Hyderabad Press Meet

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్‌ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.

మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్‌ కల్యాణ్‌ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్‌ హైదరాబాద్‌ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో..  జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో వెటకారంగా ఓ పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement