MVA Crisis: ఆ పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం! శివ సైనికులకు ఒకటే వార్నింగ్‌!

Maharashtra Political Crisis: Ramdas Athawale Warning To Shiv Sena Workers - Sakshi

సాక్షి, ముంబై: మహా రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తోంది. అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను పార్టీ నేతలు కొందరు ఇస్తుండగా మరికొందరు శివసేన ఇంటి పంచాయితీలో వేలు పెట్టబోమని అంటున్నారు. కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే తాజాగా అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఉద్ధవ్‌ థాక్రే, ఏక్‌నాథ్‌ షిండే వర్గాల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని అన్నారు.

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నివాసంలో శుక్రవారం జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్‌ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు.

అది ఎలా సాధ్యం?
చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్‌ అఘాడి సీనియర్లు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌, ఉద్ధవ్‌ థాక్రే, సంజయ్‌ రౌత్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే అన్నారు. సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్‌నాథ్‌ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

ఇక రెబెల్‌ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే స్పందించారు. శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని అన్నారు. తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. కాగా, పుణెలోని శివసేన రెబెల్‌ఎమ్మెల్యే తానాజి సావంత్‌ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. శివసైనికులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. వెన్నుపోటుదారులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top