
పట్నం దంపతులు, రంజిత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారు
కేకే, కడియం పెద్దవారు.. విమర్శలు వారి విజ్ఞతకే వదిలేద్దాం
పార్టీ వీడే వారి విషయంలో కాలమే సమాధానం చెబుతుంది
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. కానీ అధికారం పోగానే స్వార్థం కోసం కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి వంటి వారు వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానిచ్చేది లేదు. పదేళ్లు అధికారం అనుభవించిన నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందు రెండు రాళ్లు వేసి వెళతారు. కేకే, కడియం శ్రీహరి వయస్సురీత్యా పెద్దవారు.. వారినేమీ అనలేం..విజ్ఞతకే వదిలేద్దాం..కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కీలక నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. ‘రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు పార్టీలో నీడలా ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. ఆస్కార్ అవార్డుకు మించి నటిస్తే పిచ్చోళ్లలా నమ్మాం. బయటివాడు మోసం చేస్తే బాధ అనిపించదు. కానీ నీడలా తిరిగి, కష్ట కాలంలో వెంట ఉండకుండా కేసీఆర్ కూతురు అరెస్టు అవుతున్న సమయంలో నవ్వుకుంటూ వెళ్లి రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బదలా తీర్చుకోవాలి. రంజిత్‌రెడ్డి చేసిన ద్రోహానికి చేవెళ్ల నాయకులు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్‌రెడ్డి ‘లీకు వీరుడు’
‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రస్తావనకు రాకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ అంటూ యూట్యూబ్ చానళ్లకు డబ్బులిచ్చి లీకులు ఇస్తున్నాడు. కేసీఆర్‌ను బొందపెడతా అని రోత మాటలు మాట్లాడుతూ చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు రోజుకో స్కామ్ అంటూ ప్రచారం చేస్తూ కేసీఆర్ అధికారం నుంచి దిగి నాలుగు నెలలైనా యూటూŠయ్‌బ్ చానళ్లను అడ్డుపెట్టుకొని తిట్టిస్తున్నాడు. ఆరు గ్యారంటీలు పోయి ఆరు గారడీలు మాత్రమే రేవంత్ పాలనలో మిగిలాయి.
రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగి హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం, నల్లగొండ నేతలే రేవంత్ ప్రభుత్వానికి మానవబాంబులు అవుతారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా కలిపి 40 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బీజేపీని నిరోధించే శక్తి ప్రాంతీయ పార్టీల నేతలు మమతాబెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్, స్టాలిన్ వంటి వారికి మాత్రమే ఉంది’అని కేటీఆర్ అన్నారు.
కార్యకర్తల కోసం కాలికి బలపం
‘ఇన్ని రోజులు పార్టీ, నాయకుల కోసం పనిచేసిన.. కార్యకర్తల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతా. పదిమంది సభ అయినా వేయిమంది సభ అయినా వచ్చి కొట్లాడతా. సైలెంట్‌గా పనిచేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. నాయకులు పార్టీని వదిలేసినా, శ్రేణుల కోసం స్వయంగా పనిచేస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ కేంద్రీకరిస్తా. ధాన్యం బోనస్ ఇవ్వకుంటే నిప్పు రగిలిద్దాం. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండేందుకు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్ల నుంచి కేసీఆర్ అభ్యర్థిగా భావించి పనిచేద్దాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పార్టీని వీడేది లేదు: కాలే యాదయ్య
తనకు ఆస్తి లేకున్నా నైతిక విలువలు ఉన్నాయని, పార్టీని వీడే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తాము పార్టీని వీడుతున్నట్టు వస్తున్న పుకార్లు నమ్మొద్దని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కోరారు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ వెంట వారి అంతిమశ్వాస వరకు తమ కుటుంబం ఉందని, కేసీఆర్ వెంట అదే తరహాలో ఉంటామని బీఆర్‌ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.