ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్‌

Published Mon, Sep 18 2023 6:00 PM

KTR Fire On PM Modi Over Telangana Formations Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే..  ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. 

మోదీ...తెలంగాణ విరోధి!
తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు. 

తెలంగాణపై ఎంత కోపమో..
అప్పర్ భద్ర,  పోలవరం,  కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేందని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. డిపాజిట్లు కోల్పోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని ఎద్దేవా చేశారు. 

మోదీ అలా అనలే: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ ఎవర్నీ విమర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. సంతోష వాతావరణంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సామరస్యంగా చేయలేకపోయిందని మాత్రమే మోదీ అన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలను మాత్రమే మోదీ  చెప్పారు.. విభజన బిల్లు  సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే  చేశారు.. కారం, నీళ్ళు చల్లారు.. తలుపులు మూశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 'ట్విట్టర్ లేకుంటే బ్రతకను, అమెరికాలో ట్విట్టర్ నేర్చుకున్నట్లు, ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినానికి, సమైక్యతకు తేడా కేసీఆర్ కు అర్థం కావడం లేదు.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ప్రధాని మోదీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు' అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. నేతల మధ్య పొలిటికల్‌ వార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement