కామెడీగా మారిన ‘కదం తొక్కిన పసుపుదళం’.. పరువు పోయిందిగా!

Kommineni Comment On Chandrbabu Naidu Kaurava Comments At Mahanadu - Sakshi

టీడీపీ మహానాడుకు సంబంధించి మీడియాలో.. ప్రత్యేకించి ఈనాడులో వచ్చిన వార్తలను చదివితే కొన్ని ఆసక్తికరమైన  అంశాలు కనిపిస్తాయి.ఈనాడు పత్రిక తన శక్తి వంచన లేకుండా తెలుగుదేశంను జాకీలు వేసి లేపే ప్రయత్నం యధాప్రకారం చేసింది. పదిహేనువేల మంది ఈ మహానాడులో పాల్గొంటారనుకుంటే.. అనేక రెట్లు కార్యకర్తలు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయని రాశారు.సభ మొదలైనప్పటి నుంచి చివరవరకు జనం కదలలేదని ఈనాడు రాసింది. తీరా చూస్తే చంద్రబాబు మాట్లాడుతున్న తరుణంలోనే వందల కుర్చీలు ఖాళీగా కనబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. 

ఈ సందర్భంలో చంద్రబాబు అంటున్న ఒక మాట మాత్రం వాస్తవం అనిపిస్తుంది.‘‘ఈసారి ఎన్నికలలో అవకాశం వదలుకుంటే అన్నిదారులు మూసుకుపోతాయ’’ని ఆయన పార్టీ కార్యకర్తలతో అంటున్నట్లు ఆ వీడియోలో ఉంది.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యలు పత్రికలో కూడా వచ్చాయి. ఆయన భయం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలు తెలియచెబుతాయి. 

👉 జగన్ పై చంద్రబాబు అండ్‌ కో  ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. ఆయన స్కీముల ప్రభావానికి.. తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటో తెలియక చంద్రబాబు  ఆందోళన చెందుతున్నారన్నది మాత్రం అక్షర సత్యం. ఆ మాట ప్రతిసారి చెప్పలేరు కనుక రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాలని పైకి అంటుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలను కౌరవసేన అని,దానిని ఓడించి సభలోకి గౌరవంగా వెళతామని చంద్రబాబు చెప్పారు. విశేషం ఏమిటంటే 2014 ఎన్నికలలో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి. అంటే కౌరవుల సంఖ్య వందకు దాదాపు దగ్గరగా ఉందన్నమాట. ఆ తర్వాత ఆ సంఖ్యకు తోడుగా మరో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అయినా  చంద్రబాబు భాషలో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరిని.. జనం కౌరవులుగా పరిగణించి ఓడించారన్నమాట.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 

👉 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్ మిగిలిన  మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీని బహిష్కరించారు. ఆ తర్వాత   2019 లో తెలుగుదేశం కౌరవులు వంద మందిని ఓడించి.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిందని అనుకోవాలి. వైఎస్సార్‌సీపీ పక్షాన 151 మంది గెలిచారు. వీరిని కౌరవులుగా పోల్చడం వల్ల టీడీపీకి ఏమి ప్రయోజనం వస్తుందో తెలియదు. ఎవరో తెలివితక్కువగా ఇచ్చిన సలహాను చంద్రబాబు వాడుకున్నట్లు అనిపిస్తుంది. 

👉 చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీని ఆయన ఒక్కరే బహిష్కరించారు. మరి మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు ఎందుకు వస్తున్నారో వారికి కూడా తెలియదు. సభ జరిగే రోజుల్లో వారు లోపలికి  వచ్చి  కౌరవుల మాదిరి  ఏదో ఒక గొడవ చేసి బయటకు వెళుతున్నారు. కొత్తగా ఏదో ఫోర్ పి అంటూ పేదలందరిని ధనికులను చేసేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అదెలాగో ఆయన చెప్పలేరు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని మరో మాట అన్నారు. మంచిదే. మరి పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా  చంద్రబాబు ఉన్నారు కదా? అయినా పేదరికం ఎందుకు పోలేదు?. అందరిని ధనికులుగా ఎందుకు మార్చలేకపోయారు? అంటే దాని అర్ధం ఆయన ఏదో పడికట్టు పదాలతో నినాదం ఇచ్చి జనాల్ని మాయ చేసే ఆలోచనే కదా!. ఇప్పుడు చంద్రబాబు అందరినీ ధనికులను చేసేస్తానంటే ప్రజలు నమ్ముతారా?. 

👉 మరింత సంక్షేమం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఒక పక్క సంక్షేమ స్కీములతో రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేస్తారు. ఇంకో వైపు తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చంద్రబాబు అంటారు. ఆయన్ని ఎలా నమ్మలి?. ప్రభుత్వం  పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దం చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, ఆ పది లక్షలలో చంద్రబాబు టైమ్ లో చేసిన మూడు లక్షల కోట్లో, నాలుగు లక్షల కోట్లు కూడా ఉండి ఉండాలి కదా! దాని గురించి జనానికి తెలియదని ఆయన భావన అన్నమాట. 

👉 ఇక రాజకీయ తీర్మానంలో ఒక విశేషం కనిపించింది. రాష్ట్ర ,జాతీయ రాజకీయాలలో ఏమి జరుగుతోందో తెలుగుదేశం గమనిస్తోందని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.అంటే మళ్లీ అవకాశవాదంతో టీడీపీ వ్యవహరిస్తోందన్నమాట. జనసేనతో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్న విషయాన్ని కాని, ప్రధాని మోదీని మళ్లీ కాకా పడుతున్న సంగతిని కాని యనమల ఎందుకు వివరించలేదో తెలియదు. రెండు,మూడు పడవలపై కాళ్లు పెట్టి ఎటు వీలైతే అటు దూకుతారని అనుకోవచ్చన్నమాట. 

👉 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పలు తీర్మానాలు ఆమోదించిన మహానాడులో.. అమరావతి గురించి ప్రత్యేక తీర్మానం ఎందుకు పెట్టలేదో తెలియదు. అమరావతిలో యాభై వేలకు పైగా పట్టాలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎందుకు తీర్మానం చేయలేదో ఊహించుకోవచ్చు. పేదలకు జగన్  ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డు పడుతోందని, చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చుతున్నారని ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. డ్యామేజీ అయిందన్న భయంతో మహానాడు మొదటిరోజు వాటి జోలికి వెళ్లలేదనుకోవాలి. ఏది ఏమైనా మహానాడులో ఏమి చెప్పాలనుకున్నారో ఎవరికి తెలియకపోయినా, కదం తొక్కిన పసుపుదళం అంటూ ఈనాడు పత్రిక  పెద్ద హెడింగ్ లు పెట్టి మురిసిపోతే తెలుగుదేశం గెలిచిపోతుందా! వారి భ్రమ కాకపోతే!.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top