సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్‌గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్‌ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.
ఆకలేసినప్పుడు హోటల్‌లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్‌లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.
కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్‌ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్‌మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.
రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది.


