ఇలాంటి సవాల్‌ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే

Jana Reddy Speech At Congress Jana Garjana Sabha Nalgonda - Sakshi

నామినేషన్‌ వేసి ఓటర్లను కలవను

సీఎం జవాబు చెప్పాలి

బీజేపీ ఈ సవాల్‌ను స్వీకరించాలి

కేసీఆర్‌ మోసాలను ఎండగట్టడమే ఈ ఉపఎన్నిక ఎజెండా

సాగర్‌ జనగర్జన సభలో జానారెడ్డి

సాక్షి, నల్లగొండ: ‘నామినేషన్‌ వేశాక నేను ఒక్క ఓటరును కూడా కలవను. మీరు అంగీకరిస్తరా? టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూడా ఇలా ఓటర్లను కలవకుండా ఈ ఎన్నికల్లో పాల్గొంటారా? సీఎం కేసీఆర్‌ నా సవాల్‌ను స్వీకరించి జవాబు ఇవ్వాలి. బీజేపీ కూడా ఈ సవాల్‌ను స్వీకరిస్తుందా? గతంలోనే ఇలాంటి సవాల్‌ చేసిన చరిత్ర ఈ దేశంలో నా ఒక్కడిదే. ఇప్పుడూ అదే సవాల్‌ చేస్తున్నా’అని నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక బరిలో నిలిచినకాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలను ఉదహరిస్తూ ‘ఓటు అనే కత్తిని ఉపయోగించుకొని రాజుల్లా నిలబడతారా? లేక అమ్ముడుపోయి బానిసలుగా మిగిలిపోతారా? నిర్ణయం మీది’ అంటూ నియోజకవర్గ ఓట ర్లను జానా ప్రశ్నించారు. హామీల అమలులో విఫలమైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివా రం నల్లగొండ జిల్లా హాలియాలోని ఎంసీఎం కళా శాలలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు.


శనివారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన సాగర్‌ జనగర్జన సభకు హాజరైన జనం 

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే..
‘కాంగ్రెస్‌ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది... తెలంగాణ ఇచ్చింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని త్యాగం చేసింది. మా పదవులనూ త్యాగం చేశాం’అని జానారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ది అసమర్థ ప్రభుత్వమని, 15 ఏళ్ల కిందటే దేశంలో ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని గుర్తుచేశారు.

తమ పార్టీ పాలన హయాంలోనే ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, మహిళా సంఘాలు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధరలు ఇవ్వడంతోపాటు రైతులపక్షాన అడుగడుగునా అండగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని పేర్కొనారు. నాగార్జునసాగర్‌లో ఏం అభివృద్ధి జరిగింది? శూన్యం అంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రెస్‌ వల్లే పదవులు వచ్చాయని, టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకూ వివిధ పదవులు వచ్చింది కాంగ్రెస్‌ వల్లేనన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేది పదవుల కోసం కాదని, ఈ స్థానాన్ని గెలిచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వడం కోసమేనన్నారు. కేసీఆర్‌ మోసాలు, అబద్ధాలను ఎండగట్టడమే ఈ ఎన్నికల ప్రధాన ఎజెండా అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఇవి చరిత్రాత్మక ఎన్నిక అని, సాగర్‌ ప్రాజెక్టు కింద నిలబడి మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్‌ కొత్త ప్రకటనలు చేశారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ఈ ఎన్నికలో విజయం ఒక సందేశం ఇస్తుందని, జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమరిశంచారు.

రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలన: ఎంపీ కోమటిరెడ్డి
‘రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. అవినీతి, నిరంకుశ పాలన పోవడానికి కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. జానా జనంలో పుట్టిన నాయకుడు’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమని అహంకారంతో మాట్లాడిన కేసీఆర్‌ని చెప్పు ముఖ్యమంత్రి అని పిలవాలన్నారు. ఎన్నికల్లో చెప్పు పెట్టినా ఓటు వేయాలని, ఎవరిని నిలబెట్టినా ఓటు వేయాలని చెబుతున్న కేసీఆర్‌కి సిగ్గుండాలని దుయ్యబట్టారు. సాగర్‌ ఉప ఎన్నికలో 23 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలను ఊరూరా తిప్పుతూ కాంగ్రెస్‌ నేతలను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారారని, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బ్రోకర్‌గా మారాడని ధ్వజమెత్తారు. కౌలు రైతులను ఆదుకోవాలని గత ప్రభుత్వ హయాం నుంచి కాంగ్రెస్‌ పోరాడుతోందని, కానీ సీఎంకు ఏమాత్రం కనికరం లేకుండా పోయిందన్నారు. అప్పులు తీర్చే దారిలేక భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గురించి ‘సాక్షి’దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనాన్ని కోమటిరెడ్డి తన ప్రసంగంలో చదివి వినిపించారు. సభలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, ఆర్‌. దామోదర్‌రెడ్డి, కొండా సురేఖ, వి. హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top