ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్‌ వార్నింగ్‌ | Harish Rao Serious On Congress Govt Over Phone Tap | Sakshi
Sakshi News home page

ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్‌ వార్నింగ్‌

Apr 29 2026 11:17 AM | Updated on Apr 29 2026 11:21 AM

Harish Rao Serious On Congress Govt Over Phone Tap

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్‌, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్‌ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్‌ హెచ్చరించారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్‌గా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి  ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement