సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ప్రకటన చేశారు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. అలాగే.. ఫార్మాసిటీని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హై కోర్టు లో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోంది
ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధం గా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది
మేము ప్రభుత్వం లోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తాం. ఫార్మా సిటీ నీ రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వస్తె లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్‌ఎస్‌కు పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు... నిలబడదు.. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీష్‌రావు అన్నారు.
“ఫ్యూచర్ సిటీ”, “ఫార్మాసిటీ” రెండూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులే. కానీ ప్రభుత్వాలు మారడంతో వాటి దిశ కూడా మారిపోయింది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “ఫార్మాసిటీ” పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయని.. తెలంగాణ ఔషధ రంగంలో అగ్రస్థానానికి చేరుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.
అయితే ఆ ప్రాజెక్ట్‌కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోతామన్న భయం ఒకవైపు.. కాలుష్యం పెరిగి నీరు, గాలి దెబ్బతింటాయన్న ఆందోళన మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం “ఫార్మాసిటీ” ఆలోచనను పక్కనబెట్టింది. అయితే..
అదే ప్రాంతంలో “ఫ్యూచర్ సిటీ” అనే కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం పరిశ్రమల నగరం కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పరిశోధనలు, హరిత వాతావరణం, నివాసాలు, ఉద్యోగ కేంద్రాలు అన్నీ కలిసిన ఆధునిక నగరంగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.


