
భద్రాచలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన పాపం బీజేపీ, కాంగ్రెస్‌లదేనని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పినపాక నియోజకవర్గం మణుగూరులో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీతో కాంగ్రెస్‌పార్టీ చీకటి దోస్తీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణలో ఇచ్చి న హామీలను నెరవేరుస్తామని ఆ పార్టీ పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఒక్కో పార్టీ చేజారుతున్నందున రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్ర«ధాని కాలేరన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని గమనించిన ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హరీశ్ పేర్కొన్నారు. తప్పుడు అప్పుల లెక్కలతో అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఈ రెండు నెలల కాలంలోనే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరిలో జాబ్ కేలండర్ ప్రకటించకుండా మాట తప్పిన కాంగ్రెస్ పార్టీపై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
సాగర్ నీటిలో 50 శాతం కోసం బీఆర్‌ఎస్ పోరాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీలో తాకట్టుపెట్టిందని మండిపడ్డారు. ఆరు లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని తెలిపారు. ఆటో డ్రైవర్లు అత్మహత్య చేసుకున్నందున ఇకనైనా వారి విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.